ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండదేమో అనుకుంటుండగానే కేసులు పెరగడం మొదలైంది. పెరిగినా లాక్‌డౌన్ పరిస్థితులు ఉండవు లే. ఏమి జరిగినా థియేటర్లకు వచ్చిన సమస్య ఏమీ ఉండదు.. ఇలా ఎంతో ఆశతోనే చిత్ర పరిశ్రమ ఉంది. కానీ ఎప్పుడైతే దిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిందో పరిశ్రమ గుండె గుభేల్‌మంది.
బాలీవుడ్‌కు అత్యంత కీలకమైన మహారాష్ట్రలోనూ 50 శాతం ఆక్యుపెన్సీ పెట్టేశారు. ఈ క్రమంలో డిసెంబరు 31న రావాల్సిన 'జెర్సీ' వాయిదా పడింది. అక్కడితో ఆగలేదు దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఆర్‌ఆర్‌ఆర్' వాయిదా పడింది. ఈ సినిమా కోసం పలు బాలీవుడ్ సినిమాలు విడుదల తేదీలను మార్చుకున్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఈ నెల్లో విడుదల కావాల్సిన బాలీవుడ్ సినిమాలు వస్తాయా? రావా? అనే విషయంలో స్పష్టత లేదు. రోజు గడిచేకొద్దీ పరిస్థితులు మారిపోతున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన చిత్ర పరిశ్రమలో వ్యక్తమౌతుంది. అదే సమయంలో ఇదంతా తాత్కాలికమే 2022 బాలీవుడ్‌కు బాగా కలిసొస్తుంది అనేవాళ్లూ ఉన్నారు.
'ఆర్ఆర్ఆర్' వాయిదాతో బాలీవుడ్ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది. అదే తేదీకి రావడానికి బాలీవుడ్ చిత్రం ఏదీ సిద్ధంగా లేదు. 'ఆర్‌ఆర్‌ఆర్' కంటే ముందు జనవరి 6న విడుదల కావాల్సిన 'గంగూబాయి కతియావాడి'.. ఫిబ్రవరికి వెళ్లిపోయింది. ఈ చిత్ర దర్శక నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ ముందు పోటీకి సై అన్నా 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం పక్కకు తప్పుకొన్నారు. ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఫిబ్రవరిలోనే వస్తుందా? లేదంటే మళ్లీ పాత తేదీకి వచ్చే ఆలోచన చేస్తుందో చూడాలి.
వీటి మాటేంటి
ఈ నెల్లో అక్షయ్‌కుమార్ 'పృథ్వీరాజ్' 21న, జాన్ అబ్రహం 'ఎటాక్' 28న విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. 'ఎటాక్'కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా జరిగాయి. 'పృథ్వీరాజ్' పబ్లిసిటీ ఇంకా మొదలు కాలేదు. గత ఏడాది డిసెంబరులో రావాల్సిన ఈ సినిమా ట్రైలర్ విడుదలా వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల్లో సినిమాలు వస్తాయా? వాయిదా పడతాయా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
వచ్చే రెండు నెలల్లో ఎలా?
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందంటూ అంచనాలు వేస్తున్నారు. మరి ఈ నెలలో బాలీవుడ్ నుంచి 'బధాయి దో', 'గంగూబాయి కతియావాడి', 'మేజర్', 'జయేష్‌భాయ్ జోర్దార్', 'బచ్చన్‌పాండే', 'షమ్‌షేరా', 'భూల్ భులయా 2', 'అనేక్' లాంటి క్రేజీ చిత్రాలు రానున్నాయి. ఇందులో పలు ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డాయి.
అక్షయ్‌కుమార్ పృథ్వీరాజ్ మూవీ ఏళ్ల తరబడి సినిమాను విడుదల చేయకుండా ఉంటే నిర్మాతలు ఆర్థికంగా నష్టాల్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కొన్ని చిత్రాలు ఓటీటీ బాట పడతాయి అనే మాట వినిపిస్తోంది. ఇంకో రెండు మూడు నెలలు ఆగితే పరిస్థితులు చక్కబడతాయి అనే ఆశాభావాన్ని వ్యక్తం చేసే వారు ఉన్నారు. దిల్లీ ప్రభుత్వం తరహాలో మరిన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా వెళ్లి థియేటర్లను మూసివేస్తే కనుక ఓ మాదిరి చిత్రాలు ఓటీటీలోనే విడుదలవుతాయనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. థియేటర్లను మూసివేయకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరవడం వల్ల నష్టమేమీ ఉండదు అంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. అందుకే పలువురు ఇప్పటికే కొవిడ్ నిబంధలను పాటిస్తూ థియేటర్లు తెరుచుకొనేలా అనుమతులు ఇవ్వాలని సినీ ప్రముఖులు దిల్లీ ప్రభుత్వాన్ని కోరారు.
"ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వాయిదా వేస్తాం. ఒమిక్రాన్ అనేది మార్చి చివరికి కనుమరుగై పోవడం ఖాయం. ఆ తర్వాత అంతా మంచే జరుగుతుంది" అంటున్నారు నిర్మాత ఆనంద్ పండిట్.
ఎందుకిలా?
రెండోవేవ్ తర్వాత బాలీవుడ్ గాడిన పడింది. భారీ చిత్రాలు దుమ్మురేపుతాయి అనుకున్నారంతా. అనుకున్నట్లు గానే అక్షయ్‌కుమార్ 'సూర్యవంశీ' మంచి వసూళ్లు అందుకొంది. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన '83' బాక్సాఫీసు వద్ద మెరిపించలేకపోయింది. మంచి చిత్రంగా మాత్రం నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రల్లో అన్నివిధాలుగానూ బాలీవుడ్ వాటా ఎక్కువే. దీంతో బడ్జెట్ నుంచి వసూళ్లు వరకూ ఆ స్థాయిలోనే ఉండేవి. ఇప్పుడా పరిస్థితి మారుతోందా? అనిపిస్తుంది.
అలానే పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన అల్లు అర్జున్ చిత్రం 'పుష్ప' హిందీలో దుమ్ము రేపుతోంది. అదే విధంగా హాలీవుడ్ చిత్రం 'స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్' మంచి వసూళ్లు రాబడుతుంది. దీంతో బాలీవుడ్‌కు ఏమైంది? అంటూ పరిశ్రమ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇది చదవండి:సంక్రాంతికి తెలుగులో సినిమాలే సినిమాలు.. కాకపోతే 'చిన్న' ట్విస్ట్