కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోని నటులు, సాంకేతిక నిపుణులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న ఆయనకు గుండె పోటు రావడం వల్ల విక్రమ్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు(Puneeth Rajkumar death).
ప్రతి కథానాయకుడికి తమ అభిమానులు ఓ బిరుదు ఇస్తుంటారు. అలా పునీత్ రాజ్‌కుమార్‌ను కన్నడ చిత్ర పరిశ్రమలో 'పవర్‌స్టార్'(puneeth rajkumar power star) అంటారు. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాల నటుడిగా రాణించిన పునీత్ రాజ్‌కుమార్ 'అప్పు' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అక్కడి నుంచి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కన్నడ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇతర నటీనటుల పట్ల గౌరవం, అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండటం ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. తన ఇంటికి వచ్చిన ఏ అభిమానినీ నిరాశతో వెనక్కి పంపరు. ఇక పునీత్ నటించిన 29 (హీరోగా) చిత్రాల్లో అత్యధిక చిత్రాలు 100 రోజులకు పైగా ఆడాయంటే అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఈ స్టామినానే ఆయనకు 'పవర్‌స్టార్' బిరుదు వచ్చేలా చేసింది. అంతేకాదు, కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో పునీత్ ఒకరు.