తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడటానికి నువ్వెవరు' - అభిమానిపై అనసూయ ఆగ్రహం

మరోసారి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు బుల్లితెర యాంకర్, నటి అనసూయ. "నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడటానికి నువ్వెవరివి" అంటూ మండిపడ్డారు.

అనసూయ
అనసూయ

By

Published : May 17, 2020, 2:00 PM IST

తన గురించి కానీ, తన లైఫ్‌స్టైల్‌‌ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే.. అలాంటి వారికి సరైన సమాధానమే చెబుతారు బుల్లితెర యాంకర్‌ అనసూయ. తనపై వ్యాఖ్యలు చేసిన వారికి ఘాటుగా సమాధానం చెప్పి ఇప్పటికే పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా తన డ్రెస్సింగ్ గురించి కామెంట్‌ చేసిన ఓ అభిమానిపై లైవ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా డ్రెస్సింగ్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి" అంటూ గట్టిగానే ప్రశ్నించారు.

ఇటీవల తన పుట్టినరోజు పురస్కరించుకుని అనసూయ కుటుంబంతో కలిసి కొంత సమయం ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. తన ఇష్టాయిష్టాలను అభిమానులతో పంచుకున్నారు. ఇంతలో ఓ నెటిజన్‌ అనసూయను ఏకవచనంలో సంబోధించాడు. దీంతో ఆమె కొంచెం అసహనానికి లోనయ్యారు.

"మనకి తెలియని వ్యక్తిని ఎప్పుడూ ఏకవచనంలో సంబోధించకూడదు. వాళ్లకి గౌరవమివ్వాలి. నువ్వు కాదు మీరు అని పిలవడం నేర్చుకోండి. మనకు బాగా దగ్గరైన, ప్రియమైన వారిని మాత్రమే ఏకవచనంలో పిలవాలి"

-అనసూయ, నటి, యాంకర్

మరో అభిమాని "మంచి డ్రెస్‌ వేసుకోండి. మీరు ఇద్దరు పిల్లలకి తల్లి అని మర్చిపోకండి" అని కామెంట్‌ పెట్టాడు. దీంతో అనసూయ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా డ్రెస్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి అసలు. నీకసలు అమ్మతనం అంటే తెలుసా? ఓ తల్లి ఎలా ఉండాలో, ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి నువ్వు ఎవరు? ఇది ఒక అమ్మ జీవితం. తాను కోరుకున్న విధంగా జీవించే హక్కు తనకి ఉంది. నాకు నచ్చినట్టు, అందంగా కనిపించేటట్టు నేను దుస్తులు వేసుకుంటా." అని అనసూయ ఘాటుగా సమాధానం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details