'టైటానిక్' సినిమా అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారేమో. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో ముద్రవేసింది. ప్రధాన పాత్రల్లో నటించిన లియొనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్.. చాలా మంది ఆరాధ్య తారలుగా మారారు. 1997లో వచ్చిన ఈ సినిమా.. రికార్డులతో పాటు పలు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. అయితే ఇటీవలే ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో కేట్ మాట్లాడుతూ.. ఈ చిత్ర విడుదల తర్వాత భారత్‌లో తనకెదురైన ఆసక్తికర అనుభవాన్ని పంచుకుంది. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురైనట్లు తెలిపింది.
"టైటానిక్' ప్రతిచోటా ఉంది. ఆ సినిమా విడుదలైన ఓ రెండేళ్ల తర్వాత భారత్ సందర్శనకు వెళ్లాను. హిమాలయ పర్వాతాల్లో నడుస్తుండగా, కర్రపట్టుకుని నడుస్తున్న ఓ వృద్ధుడు నా దగ్గరకు వచ్చాడు. అతనికి దాదాపు 85 ఏళ్లు ఉంటాయి. అతని నా వైపు చూసి, నువ్వు 'టైటానిక్'లో రోజ్ కదా అని అన్నాడు. తన చేతిని గుండెలపై పెట్టుకుని ఆప్యాయంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. 'టైటానిక్'.. ఎంతో మంది అభిమానాన్ని పొందేలా చేసిందని ఆ నిమిషం నాకు నిజంగా అర్థమైంది"