బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా కష్టపడుతున్న సమయంలో తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ప్రముఖ నటి కంగనా రనౌత్. స్నేహం ముసుగులో ఓ నటుడు తనను పార్టీలకు తీసుకెళ్లి తాగే పానీయాల్లో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేవాడని పేర్కొంది. తన కెరీర్ ప్రారంభంలో అతను.. తనను వదిలేసి వేరొకరితో సహజీవనం చేశాడని ఆరోపించింది. అయితే, అకస్మాత్తుగా ఒకరోజు జరిగిన సంఘటనలతో తన జీవితం మలుపు తీసుకున్నట్లు వివరించింది.
"ఏమైందో ఏమో తెలియదు. ఆమెతో గొడవ పడి.. అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పాడు. నా వస్తువులను ఇంట్లోనే ఉంచి.. నన్ను గదిలో బంధించాడు. నేను ఏం చేసినా అక్కడున్న సిబ్బంది వెంటనే అతనికి సమాచారం అందించారు. దాదాపు అది గృహ నిర్బంధంలా అనిపించింది. అతను నన్ను పార్టీలకు తీసుకెళ్లి నాకు మత్తు పదార్థాలు ఎక్కించాడు. అది మా మధ్య సాన్నిహిత్యానికి దారి తీసింది. అయితే, నాకు ఇష్టం లేకుండానే జరిగిందని తర్వాత గ్రహించా. ఆ సంఘటన జరిగిన వారంలోనే తనను నాకు భర్తగా ప్రకటించుకున్నాడు. ఒక వేళ నేను నువ్వు నా బాయ్ఫ్రెండ్వి కాదని అంటే.. నన్ను కొట్టడానికి చెప్పు ఎత్తేవాడు."
-కంగనా రనౌత్, సినీ నటి