Gamanam music director Ilayaraja: "పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పరిపూర్ణమైన జీవన ప్రయాణం గురించి చెప్పే సినిమానే ఈ 'గమనం' " అన్నారు దర్శకురాలు సుజనా రావు. ఆమె తెరకెక్కించిన తొలి చిత్రమిది. శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు సుజనా రావు. ఆ విశేషాలు..
"నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చిన సంఘటనల స్ఫూర్తితోనే నేనీ కథ రాసుకున్నా. ఇందులో మూడు నాలుగు కథలుంటాయని కాదు. ఓ పరిపూర్ణమైన జీవన చక్రాన్ని ఇందులో చూపించాలని అనుకున్నా. ఈ కథను తొలుత ఓ డ్రాఫ్ట్‌లా రాసుకున్నా. దాన్ని నిర్మాత జ్ఞానశేఖర్ సర్‌కు పంపాను. ఆయనకది బాగా నచ్చింది. తొలుత ఈ చిత్రాన్ని చిన్నగానే తీయాలనుకున్నాం. కానీ, ఒకొక్కరిగా అగ్ర తారలందరూ వచ్చి చేరడం వల్ల పెద్ద సినిమాగా మారిపోయింది".
"ఈ కథను శ్రియా వద్దకు తీసుకెళ్లే వరకు నా కమల ఆమె అని తెలియదు. సగం కథ చెప్పిన తర్వాత తనే నా కమల అని నిర్ణయించుకున్నాను. ఆమె కథ మొత్తం విన్నాక.. అలా లేచి నన్ను గట్టిగా హత్తుకుని ఏడ్చేశారు. ఇందులో శివ కందుకూరి క్రికెటర్ అవ్వాలనుకునే అలీ అనే కుర్రాడిగా కనిపిస్తారు. అతన్ని ప్రేమించే యువతిగా ప్రియాంక కనిపిస్తుంది. నిత్యామేనన్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. వీటిలో ప్రతీ పాత్రకు ఓ జర్నీ ఉంటుంది".