మెగాస్టార్ అమితాబ్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే బిగ్‌బీ స్థాయిలో ఫేమ్ రాకపోయినా తనదైన శైలిలో రాణిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఫ్లాప్‌లతో సతమతమయ్యారు. తాజాగా ఆయన నటించిన 'ది బిగ్ బుల్' విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకానొక దశలో తాను సినిమాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
'సినిమాలకు దూరమైపోదామనుకున్నా.. కానీ' - అమితాబ్
కెరీర్ ఫ్లాప్‌లతో నడుస్తున్న దశలో సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని తాను భావించినట్లు తెలిపారు బాలీవుడ్ నటుడు అభిషేక్‌బచ్చన్. ఆ సమయంలో.. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి పెద్ద తప్పు చేశానని అనుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. కానీ, ఆ తర్వాత తన తండ్రి దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తిని నింపి చిత్రసీమలో కొనసాగేలా చేశాయని చెప్పారు.
"ఫ్లాప్‌లతో కెరీర్ సాగుతున్న సమయంలో ఒత్తిడి తట్టుకోలేక సినిమాల నుంచి తప్పుకోవాలని భావించా. ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టి పెద్ద తప్పు చేశానని అనుకున్నా. ఇదే విషయాన్ని మా నాన్నకు చెప్పాను. సినిమాల్లో నటించడానికి అర్హున్ని కాదని అన్నాను. దానికి ఆయన బదులిస్తూ... 'నువ్వు ఓడిపోవాలని నిన్ను పెంచలేదు. ప్రతి ఉదయం బతకడానికి పోరాడాలి. నీ స్థిరత్వాన్ని కాపాడుకోవాలి. ఓ నటుడిగా ప్రతి సినిమాకు నీవు మెరుగవుతున్నావు' అని చెప్పారు. ఆ మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అందుకే చిత్రసీమలో ఇంకా కొనసాగుతున్నాను" అని అభిషేక్ అన్నారు. ప్రస్తుతం ఆయన తుషార్ దర్శకత్వంలో 'దాస్వీ' సినిమాలో నటిస్తున్నారు.
ఇదీ చూడండి :అవకాశం కోసం పోరాటం నుంచి స్టార్డమ్ వరకు