మళ్లీరావా చిత్రంతో ఓ అందమైన ప్రేమకథను సినీప్రియులకు రుచి చూపించి.. తొలి అడుగులోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు గౌతమ్ తిన్ననూరి. రెండో ప్రయత్నంగా జెర్సీ సినిమాతో జాతీయ స్థాయిలో మెరిశారు. చరిత్రలోనే మిగిలిపోయిన అనేక మంది సచిన్‌ల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని.. తండ్రీ కొడుకుల అనుబంధంతో అల్లుకున్న ఓ చక్కటి కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. దీనికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని.. ఇప్పుడు బాలీవుడ్‌లో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు గౌతమ్. దీని తర్వాత ఆయన తెలుగులో చేయనున్న చిత్రమేదన్నది స్పష్టత లేదు. కథానాయకుడు రామ్‌చరణ్‌తో పాటు పలువురు స్టార్ హీరోలకు కథలు వినిపించినా.. దేనిపైనా స్పష్టత రాలేదు.
ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. గతేడాది నితిన్ హీరోగా భీష్మ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు మరో కొత్త కబురేమీ వినిపించలేదు. సాయి తేజ్, వరుణ్ తేజ్ లాంటి యువ హీరోల కోసం కథలు సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నా.. ఇంత వరకు ఏదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన మహేష్ - త్రివిక్రమ్‌ల కొత్త చిత్రం కోసం స్క్రిప్ట్ వర్క్‌లో సహాయ పడుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. కొవిడ్ పరిస్థితులు కుదటపడగానే ఆయన నుంచి కొత్త కబురు వినిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఘాజీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మెరిశారు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా వరుణ్ తేజ్‌తో అంతరిక్షం చిత్రం చేశారు. ఇది ఓ మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా.. సంకల్ప్ తెలుగులో మరో కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. బాలీవుడ్‌లో విద్యుత్ జమ్వాల్‌తో ఓ యాక్షన్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కరోనా పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి యువతరం మెచ్చే కథలతో బాక్సాఫీస్ ముందు వరుస విజయాలు అందుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. మీకు మాత్రమే చెప్తా సినిమాతో ఇటీవలే కథానాయకుడిగానూ తెరపై మెరిశారు. అయితే ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న తర్వాతి చిత్రమేదన్నది ఇంత వరకు స్పష్టత లేదు. వెంకటేష్‌తో ఓ హార్స్ రేసింగ్ సినిమాని పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించినా.. ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఒక క్రైమ్ డ్రామా కథాంశంతో ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపించినా.. దానిపైనా ఎలాంటి స్పష్టత రాలేదు.