తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ములాన్​' బాయ్​కాట్​కు కారణమేంటి?

'ములాన్' సినిమా ప్రసారాన్ని నిలిపేయాలని హాంకాంగ్​, థాయ్​లాండ్​, తైవాన్​లలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇంతకీ ఈ చిత్రంపై ఎందుకింత వ్యతిరేకత?

What's behind the push to boycott Disney's new 'Mulan' movie?
'ములాన్​' బాయ్​కాట్ చేయడం ఎందుకు?

By

Published : Sep 11, 2020, 1:32 PM IST

ములాన్​.. ప్రపంచవ్యాప్తంగా నేడు వినిపిస్తున్న హాలీవుడ్​ సినిమా పేరిది. 1998లో విడుదలైన 'ములాన్​' యానిమేటెడ్​ చిత్రానికి తీసిన రీమేక్​. వాల్ట్​డిస్నీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై ప్రస్తుతం పెద్ద వివాదమే చెలరేగుతోంది. ఇప్పటికే డిస్నీ ప్లస్​లో విడుదవగా.. శుక్రవారం చైనా వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని హాంకాంగ్​, థాయ్​లాండ్​, తైవాన్​లలో నిరసనలు హోరెత్తుతున్నాయి. హ్యాష్​ట్యాగ్​ బాయ్​కాట్​ములాన్​ పేరు ట్రెండింగ్​లో ఉంది. అమెరికాలో కూడా డిస్నీ సంస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరి ఈ సినిమాపై ఎందుకింత వ్యతిరేకత? దానికి దారితీసిన పరిణామాలేంటి?

హీరోయిన్​ వ్యాఖ్యలు..

ఈ చిత్రంలో ములాన్​ పాత్ర పోషించిన లియూ ఈఫే చైనాకు చెందిన అమెరికన్​ నటి. గతేడాది చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాంకాంగ్​లో ప్రజాస్వామ్య ఆందోళనలు మిన్నంటాయి. చైనాకు చెందిన ఓ జర్నలిస్టుపై ఆందోళనకారులు జరిపిన దాడిని ఖండిస్తూ గతేడాది ఆగస్టులో హాంకాంగ్​ పోలీసులకు మద్దతుగా ఆమె ఓ పోస్టు చేశారు. "నేనూ హాంకాంగ్​లో పోలీసులకు మద్దతిస్తా. నన్నూ మీరు కొట్టొచ్చు. హాంకాంగ్​కు ఇది సిగ్గుచేటు" అని అందులో పేర్కొంది. దీంతో నిరసనకారుల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

'ములాన్​' సినిమా పోస్టర్​

ఆందోళనకారులను తీవ్రంగా అణచివేస్తున్న హాంకాంగ్​ పోలీసులకు మద్దతుగా నిలుస్తారా అని వ్యతిరేకత మొదలైంది. హ్యాష్​ట్యాగ్​ బాయ్​కాట్​ములాన్​ పేరుతో అప్పట్లోనే నిరసనలు మిన్నంటాయి. అయితే ఈ ఏడాది చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టంతో తీవ్రత మరింత పెరిగింది. థాయ్​లాండ్​, తైవాన్​లలో కూడా ఆందోళనకారులు నిరసన చేపట్టారు.

జింజియాంగ్​ ప్రావిన్సులో చిత్రీకరణ..

ఈ చిత్రంలో కొంత భాగాన్ని చైనాలోని జింజియాంగ్​ ప్రావిన్సులో చిత్రీకరించడం ప్రస్తుత వివాదానికి మరో కారణం. ఉయ్​గర్​, తదితర ముస్లిం వర్గాలు ఎక్కువగా నివసించేవి ఈ ప్రాంతాలోనే. వీరిని చైనా అణచివేయాలనుకుంటోందనే ఆరోపణలున్నాయి. పెద్ద ఎత్తున నిర్బంధ కేంద్రాలను నిర్మించి ఉయ్​గర్​ ముస్లింలను నిర్బంధించారని అమెరికాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నివేదికలను విడుదల చేశాయి.

అయితే వీటిని విద్యాభ్యాస, ఉపాధి శిక్షణా కేంద్రాలుగా చైనా చెప్పుకొచ్చింది. దీంతో ఈ విద్యాభ్యాస, ఉపాధి శిక్షణ కేంద్రాలను చిత్రీకరణ బృందం చూసే ఉంటుందన్న భావనలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి. అయినా డిస్నీ మిన్నకుండిపోవడానికి వెనుక కారణాలేంటన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.

స్పెషల్​ థ్యాంక్స్​..

జింజియాంగ్​లో చిత్రీకరణకు సహకరించినందుకు చైనాలోని కొన్ని విభాగాలకు చిత్రబృందం ప్రత్యేక కృతజ్ఞతలు (స్పెషల్​ థ్యాంక్స్​) చెప్పింది. ఎండ్​ టైటిల్స్​లో ఈ విభాగాల పేర్లను ప్రస్తావించింది. ఇందులో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ప్రచారం విభాగం, టర్పన్​ పబ్లిక్​ సెక్యూరిటీ బ్యూరో వంటివి ఉన్నాయి. దీంతో వివాదం మరో స్థాయికి వెళ్లింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన ఈ విభాగాలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణాలు లేకపోలేదు.

జింజియాంగ్​ ప్రాంతంలోని టర్పన్​ పబ్లిక్​ సెక్యూరిటీ బ్యూరోతో పాటు మిగతా పోలీసు విభాగాలు అమెరికా ఉత్పత్తులపై నిషేధం విధించాయి. అంతేకాకుండా ఉయ్​గర్​ల అణచివేత వెలుగులోకి రాకుండా సీసీపీ ప్రచారం విభాగం పక్కదోవ పట్టిస్తోందని అమెరికా సంస్థలు ఆరోపించాయి. దీంతో వాల్ట్​ డిస్నీ సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది. ఇది అమెరికా చైనాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చేలా చేసింది.

సెనేటర్​ లేఖ..

మానవ హక్కులను కాలరాస్తున్న చైనా విభాగాలకు కృతజ్ఞతలు చెప్పిన డిస్నీ సంస్థ తీరును అమెరికన్​ సెనేటర్​ జోష్​ హాలే ఖండించారు. ఉయ్​గర్​లపై చైనా చేస్తున్న మారణహోమాన్ని కప్పిఉంచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డిస్నీ సంస్థ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన అన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్న సంస్థ నిబద్ధతకు ఇది విఘాతం కలిగిస్తోందని హాలే భావించారు. కమ్యూనిస్టు పార్టీ సంస్థల నుంచి డిస్నీ ఏ సహాయం పొందిందో వివరించాలంటూ పలు ప్రశ్నలతో ఆ సంస్థకు లేఖ రాశారు.

జాతీయవాదం ప్రేరేపించేలా..

అయితే తాజా నిరసనలు, ఆందోళనలు చైనీయుల్లో జాతీయవాదన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని విమర్శకులు చెబుతున్నారు. చైనా మూలాలనున్న నటీనటులు ఉండటం ఈ సినిమాకు అదనపు బలమని అంటున్నారు. కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. దీంతో సినిమాకు లాభం చేకూరవచ్చని అంటున్నారు.

ఇప్పటికే ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా పేరు చక్కర్లు కొడుతోంది. మరోవైపు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే డిస్నీ ప్లస్​లో విడుదల కావడం వల్ల మంచి వసూళ్లను రాబట్టింది. భారీ మార్కెట్​ ఉన్న చైనాలో విడుదలపై సంస్థ అంచనాలను పెంచుకుంది.

ఈ సినిమా ప్రసారం వద్దు: చైనా

చైనా వ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్నందున ఈ సినిమా వార్తలు ప్రసారం చేయోద్దని ప్రముఖ మీడియా సంస్థలకు చైనా అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details