తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీ.. నీకు ఇంత క్రేజ్ ఎందుకమ్మా? - OTT amazon prime video netflix

నిత్యజీవితంలో ఓటీటీ కల్చర్ భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సినిమాలు, వెబ్ సిరీస్​లు అని తెగ చూసేస్తున్నారు. ఇంతకీ ఓటీటీ కథేంటంటే?

Everything You Need to Know about OTT
ఓటీటీ గురించి పూర్తి సమాచారం

By

Published : Dec 22, 2020, 9:05 AM IST

Updated : Dec 22, 2020, 9:28 AM IST

మార్చి 24.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజులు ఎవరికీ ఏం అనిపించలేదు. కానీ ఆ తర్వాత​ చిరాకు మొదలైంది! థియేటర్లు, మాల్స్​, టూర్స్​కు వెళ్లలేక ఇంట్లో ఉండేసరికి ఇబ్బందిగా అనిపించింది. అలాంటి సమయంలో అపద్భాంధవుడిలా కనిపించింది ఓటీటీ.

అప్పటివరకు లక్షల మందికి మాత్రమే తెలిసిన 'ఓటీటీ'.. లాక్​డౌన్​ దెబ్బకు కొన్ని కోట్ల మందికి సుపరిచితమైంది. ఇంతకీ ఓటీటీ అంటే ఏంటి? భారత్​లోకి ఎప్పుడు వచ్చింది? ఎంతమంది ఓటీటీని ఉపయోగిస్తున్నారు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ఓటీటీ వినియోగంపై ప్రత్యేక కథనం

ఓటీటీ అంటే?

ఓటీటీ అంటే 'ఓవర్ ది టాప్'. మనకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్​లు, డాక్యుమెంటరీలను పలు యాప్స్​లో నచ్చిన సమయంలో, ఎప్పుడైతే అప్పుడు చూడొచ్చు. ఇందుకోసం కేవలం కొంత మొత్తం చెల్లించి సబ్​స్క్రిప్షన్​ చేసుకుంటే సరిపోతుంది.

భారత్​లోకి ఓటీటీ ఎప్పుడు వచ్చింది?

2008లో రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్​కు చెందిన 'బిగ్​ఫ్లిక్స్' ఫ్లాట్​ఫామ్ మొదటగా మనదేశంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కాలంలో నెక్స్ జి టీవీ, డిటో టీవీ, సోనీ లివ్ వచ్చాయి. 2016లో నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వచ్చిన తర్వాత మనకు ఓటీటీ కల్చర్ బాగా అలవాటైపోయింది.

ఓటీటీల్లో మన సబ్​స్క్రైబర్స్​ ఎంతమంది?

ఈ ఏడాది మార్చిలో 22.2 మిలియన్ల మందికి పైగా ఉన్న సబ్​స్క్రైబర్స్​.. జులై నాటికి 29 మిలియన్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30 మిలియన్లకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది.

ఓటీటీ వినియోగంపై ప్రత్యేక కథనం

ఓటీటీ పరిస్థితి ఎలా ఉంది?

2012లో కేవలం రెండు యాప్స్​ మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 40కి చేరింది. ముందు ముందు మరిన్ని యాప్స్​ వచ్చే అవకాశముంది. భారత్​లో ఓటీటీ వ్యూయర్​షిప్ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉందని నాస్కామ్ ఇటీవల వెల్లడించింది.

ఏయే యాప్స్​ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్​ వీడియో యాప్​లను వీక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. దాని తర్వాత పలు ప్రాంతీయ ఓటీటీ యాప్​లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

వాటి కోసం ఖర్చు ఎలా?

ఈ యాప్​ల కోసం సంవత్సర చందాలతో పాటు నెలవారీ చందాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి తగ్గట్లు వారు సంబంధిత యాప్స్​ను సబ్​స్క్రైబ్​ చేసుకుని నచ్చిన సమయంలో ఇష్టమైన వీడియోల్ని(సినిమాలు, వెబ్ సిరీస్​లు etc..) చూడొచ్చు.

ఓటీటీ వినియోగంపై ప్రత్యేక కథనం

ఏ భాష వీడియోల్ని ఎక్కువగా చూస్తున్నారు?

భారతీయుల్లో కేవలం ఏడు శాతం మందే ఇంగ్లీష్ కంటెంట్​ను వీక్షిస్తున్నారని ఐబీఈఎఫ్ అంచనా వేసింది. మిగిలిన వారందరూ ప్రాంతీయ భాషల వీడియోలనే ఎక్కువగా చూస్తున్నట్లు తెలిపింది. లాక్​డౌన్ ప్రభావంతో కేవలం యువతరమే కాకుండా గృహిణులు, వృద్ధులు కూడా ఓటీటీలపై ఇష్టం పెంచుకున్నారు. వారందరూ ఓటీటీలో ప్రాంతీయ భాషలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.

ఓటీటీలపై నిర్మాతల ఆలోచన ఎలా ఉంది?

మొన్న మొన్నటి వరకు థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించకపోవడం వల్ల చాలామంది చిన్న, అగ్ర నిర్మాతలు తమ సినిమాల్ని నేరుగా పలు ఓటీటీ యాప్స్​లో విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో దక్షిణాది కంటే బాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి!

ఓటీటీల్లో నేరుగా వచ్చిన సినిమాలేంటి?

ఓటీటీల్లో నేరుగా వచ్చిన హిందీ చిత్రాల్లో 'దిల్​ బెచారా', 'గులాబో సితాబో', 'శకుంతలా దేవి', 'గుంజన్ సక్సేనా', 'బుల్ బుల్', 'ఖాలీ పీలీ', 'సడక్ 2', 'లక్ష్మి' ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాది విషయానికొస్తే అగ్రహీరోలు సినిమాలు ఏవి దాదాపుగా రాలేదు. చిన్న చిన్న సినిమాలే ఎక్కువగా ఓటీటీలో విడుదలయ్యాయి.

థియేటర్లు తెరుచుకుంటే ఓటీటీ పరిస్థితి?

దాదాపు 10 నెలల నుంచి ఓటీటీకి బాగా అలవాటు పడిన ప్రజలు.. తిరిగి తెరుచుకున్న థియేటర్లకు మళ్లీ అంతకు ముందులా వెళ్తారా అంటే సందేహమే! ఎందుకంటే ఖర్చు విషయంలో ఓటీటీతో పోల్చితే థియేటర్​కు వెళ్లడం చాలా ఎక్కువ!

టాలీవుడ్​కు ఓటీటీతో రిలేషన్ ఎలా ఉంది?

ఈ ఏడాది ఓటీటీలో నేరుగా విడుదలైన వాటిలో దాదాపు అన్ని తక్కువ బడ్జెట్​ తెలుగు చిత్రాలే ఉన్నాయి. అగ్రహీరోల సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భీష్మించుకు కూర్చున్నారు. ఓటీటీలు భారీ మొత్తంలో ఆఫర్లు ఇచ్చినా సరే వాటిని తిరస్కరించారు. ఈనెల 25 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనుండటం, సంక్రాంతి దగ్గర్లో ఉండటం వల్ల వారిలో కొత్త జోష్ మొదలైంది.

ఓటీటీ వినియోగంపై ప్రత్యేక కథనం

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2020, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details