తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ చరిత్రలో 'డిసెంబర్​ 28' ప్రత్యేకతలు.. - lumier brotehrs

సినీ చరిత్రలో డిసెంబర్​ 28 ప్రత్యేకమైంది. 1895లో సరిగ్గా ఇదే రోజు లూమియర్​ బ్రదర్స్​ తొలిసారి సినిమాను ప్రదర్శించారు! మరి ఇదే తేదీన ప్రపంచ సినిమా రంగంలో ఇంకా ఏయే అద్భుతాలో జరిగాయో ఓ లుక్కేద్దాం.

what are the specials in cinema history on december 28th
సినీ చరిత్రలో 'డిసెంబర్​ 28' ప్రత్యేకతలు ఏంటంటే..?

By

Published : Dec 28, 2020, 5:32 AM IST

సినీ చరిత్రలో డిసెంబర్​ 28కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ​

తొలి టికెట్‌ తెగింది!

సినిమా ప్రక్రియకు నాంది పలికింది ఎవరంటే లూమియర్‌ బ్రదర్స్‌ అని చెబుతారు. తెరపై కదిలే బొమ్మలతో ప్రపంచాన్ని ఆకర్షించిన వాళ్లు తొలిసారి వ్యాపారాత్మకంగా సినిమాను ప్రదర్శించినది ఈరోజే! అంటే మొదటి సారిగా టికెట్‌ పెట్టి సినిమాను ప్రదర్శించారన్నమాట. ఆ విధంగా ప్రపంచ సినిమా ప్రదర్శనలో తొలి టెకెట్‌ 1895 డిసెంబర్‌ 28న ప్యారిస్‌లో తెగింది. ఆ ప్రదర్శనలో కేవలం ఒక్క నిమిషంలోపు మాత్రమే నిడివి ఉండే పది సినిమాలను ప్రదర్శించారు. ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న కార్మికులు, నీటిని వెదజిమ్మే స్ప్రింకర్లు, ఫొటోగ్రాఫర్ల సమావేశం, గుర్రపు స్వారీ విన్యాసాలు, చేపల వేట, కమ్మరి పని, పిల్లాడికి బ్రేక్‌ఫాస్ట్‌ పెట్టడం, సముద్ర స్నానాలు లాంటి దృశ్యాలను చూపించారు.

లూమియర్‌ బ్రదర్స్

లూమియర్‌ బ్రదర్స్‌ రూపొందించిన సినీమాటోగ్రఫీ అనే పరికరంతో వీటిని ప్రదర్శించారు. ప్యారిస్‌లో అలనాడు తొలి సినిమాను ప్రదర్శించిన స్థలంలో ఇప్పుడున్న భవనంలో 'లూమియర్‌ కేఫ్‌' అనే రెస్టారెంట్‌ నాటి చరిత్రను గుర్తు చేస్తూ ఉంది. ఇంతకీ ఆ ప్రేక్షకులు చెల్లించిన టికెట్‌ ధర ఎంతో తెలుసా? ఒక ఫ్రాంక్‌. ఇది అమెరికా కరెన్సీలో చూస్తే 20 సెంట్లకు సమానం.

పిచ్చిమారాజు కథ!

అనగనగా ఓ రాజుగారు. ఆయనకు ఏదో తెలియని మానసిక రోగం పట్టుకుంది. దాంతో ఏదేదో మాట్లాడ్డం మొదలెట్టాడు. పిచ్చి చేష్టలు చేయసాగాడు. రాజవైద్యులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. మరి పరిపాలన ఎలా? అందుకే ఈ సంగతి బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు కొన్ని నిబంధనలు మార్చారు. ఆయన పిచ్చి బయట పడకుండా రకరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అయోమయ సన్నివేశాల్లో బోలెడంత హాస్యం పండింది. ఈ కథాంశంతో తీసిన సినిమా 'ద మ్యాడ్‌నెస్‌ ఆఫ్​‌ కింగ్‌ జార్జి' 1994, డిసెంబర్​ 28న విడుదలైంది.

'ద మ్యాడ్‌నెస్‌ ఆఫ్​‌ కింగ్‌ జార్జి'

అయితే.. ఇదేదో జానపద కథ కాదు. బ్రిటన్‌ రాజు మూడో కింగ్‌ జార్జి నిజ జీవిత కథ. ఈయన 1760 కాలం నాటి వాడు. అప్పట్లో ఆయన వింత ప్రవర్తనకు కారణం ఏమిటో ఆనాటి వైద్యులకు అంతుపట్టలేదు. ఈయన పిచ్చి ప్రవర్తన వల్ల తన పెద్ద కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌'తో సంబంధాలు బెడిసి కొట్టాయి. ఓ పక్క రాజుగారి విచిత్ర వైఖరి, మరో పక్క రాజకీయాల మధ్య సాగే ఈ హాస్యభరిత జీవిత కథ ప్రతిష్ఠాత్మక బాఫ్తాలాంటి ఎన్నో అవార్డులను పొందింది.

విలక్షణ నటుడు

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చాలా సినిమాల్లో ఆయన కనిపిస్తారు. పాత్ర ఎలాంటిదైన తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మీద తనదైన ముద్ర వేస్తారు. ఆయనే డెంజెల్‌ వాషింగ్టన్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మూడు గోల్డెన్‌ గ్లోబ్, రెండు ఆస్కార్, ఒక టోనీలాంటి అవార్డులెన్నో ఆయన అందుకున్నారు. 'గ్లోరీ', 'ట్రైనింగ్‌ డే', 'సిటీ ఫ్రీడమ్‌', 'మాల్‌కోమ్‌ 10', 'ద హర్రీకేన్‌', 'రిమెంబర్‌ ద టైటన్స్‌', 'ద గ్రేట్‌ డిబేటర్స్‌', 'అమెరికన్‌ గ్యాంగ్‌స్టర్‌' సినిమాల్లో డెంజెల్​ నటన ఆకట్టుకుంటుంది. ప్రతిష్ఠాత్మకమైన సిసిల్‌ బి.డెమెల్లే జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. న్యూయార్క్‌లో 1953లో పుట్టిన ఈయన 64 ఏళ్లు.

అరుదైన నటి..

66 ఏళ్ల సుదీర్ఘ నటనా ప్రస్థానం.. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం.. ఉత్తమ నటిగా ఆస్కార్, బాఫ్తా, గోల్డెన్‌గ్లోబ్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు. ఇవన్నీ ఇంగ్లిష్‌ నటి డేమ్‌ మార్గరెట్‌ నటాలీ స్మిత్‌ వివరాలు. నాటక రంగమైనా, బుల్లితెరైనా, వెండితెరైనా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా ఆస్కార్, ఎమ్మీ(టీవీ), టోనీ(నాటక రంగం) అవార్డులు అందుకున్న వారిని 'ట్రిపుల్‌ క్రౌన్‌ ఆప్‌ యాక్టింగ్‌' అంటారు. ఈ గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ మంది తారల్లో ఈమె ఒకరు. ఇంగ్లండ్‌లో 1934, డిసెంబర్​ 28న పుట్టిన ఈమె 'నోవేర్‌ టు గో', 'ద ప్రైమ్‌ జీన్‌ బ్రోడీ', 'కాలిఫోర్నియా స్యూట్‌', 'ఎ ప్రైవేట్‌ ఫంక్షన్‌', 'ద లోన్లీ ప్యాసన్‌ ఆఫ్‌ జుడిత్‌ హీర్నీ', 'టీ విత్‌ ముస్సోలిని', 'ఒథెల్లో', 'ట్రావెల్స్‌ విత్‌ మై ఆంట్‌' లాంటి సినిమాలతో గుర్తింపు పొందింది.

నటి డేమ్‌ మార్గరెట్‌ నటాలీ స్మిత్‌

ఐదేళ్ల పాప కోసం ప్రత్యేకంగా సినిమా

ఆరేళ్ల వయసులోనే ప్రహ్లాదుడిగా అద్భుతంగా నటించి అబ్బురపరిచిన రోజారమణిలాగే హాలీవుడ్‌లో చిన్నవయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న బాల నటి షిర్లీ టెంపుల్‌. ముద్దుగా ఉంటూ ఎంతో చలాకీగా నటించే ఈమె కోసమే ప్రత్యేకంగా కథలల్లి సినిమాలు తీసేవారు. పోస్టర్లలో సినిమా పేరు కన్నా పైన పెద్ద అక్షరాలతో ఆమె పేరే వేసేవారంటే ఆ పాప సంపాదించిన ప్రాచుర్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అలా ఆమె కోసమే తీసిన తొలి సినిమా 'బ్రైట్‌ఐస్‌'. ఈ చిత్రం 1934, డిసెంబర్​ 28న విడుదలైంది. ఇందులో షిర్లీ నటనకు ప్రత్యేకంగా ఆస్కార్‌ అవార్డు ఇవ్వడం విశేషం. ఒక పాత్రలో నటనకు చిన్న వయసులో ఆస్కార్‌ అందుకున్న అరుదైన రికార్డు అప్పట్లో ఆమెదే. ఇందులో ఆ చిన్నారి 'ఆన్‌ ద గుడ్‌ షిప్‌ లాలీపాప్‌' అనే పాట కూడా పాడడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమా డీవీడీల్లో అమ్ముడవుతోంది. అప్పట్లో నలుపుతెలుపుల్లో తీసిన ఈ సినిమాను కలర్‌ ప్రింట్‌గా మార్చారు.

'బ్రైట్‌ఐస్‌'లో షిర్లీ టెంపుల్

ఇదీ చూడండి:2020 రౌండప్: అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా

ABOUT THE AUTHOR

...view details