తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌ది గొడవపడే తత్వం కాదని, ఈ విషయంలో రితేష్‌ని మెచ్చుకోవచ్చని నటి జెనీలియా అన్నారు. రితేష్‌తో ఉన్న బంధం గురించి ప్రశ్నించగా జెనీలియా ఈ విధంగా స్పందించారు.
"మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నప్పుడు.. ఇన్నేళ్లుగా ఈ రిలేషన్‌ను ఎలా కొనసాగిస్తున్నారని చాలా మంది ప్రశ్నించారు. అప్పుడు దానికి మా వద్ద సమాధానం లేదు. ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లైన తర్వాత, ఇద్దరు పిల్లలు జన్మించాక కూడా అలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. నాకు తెలిసి మేమిద్దరం ఎక్కువగా కమ్యూనికేట్ అవుతుంటాం, అది లేకపోవడం వల్లే అనేక బంధాల్లో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. అందరిలాగే.. మేమూ వాదించుకుంటాం. తను లేకపోతే నేను జీవించలేనని భావోద్వేగానికి గురైన సందర్భాలూ ఉన్నాయి. ఇదంతా జీవితంలో భాగం. కానీ మా ఇద్దరికీ లైఫ్‌లో ఏది ముఖ్యమో బాగా తెలుసు. అందుకే చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వం. రితేష్ వల్ల ఎప్పుడూ సమస్యలు రావు, దానికి అతడిని ప్రశంసించాలి. కేవలం నేను కొట్లాడాలనుకుంటే తప్ప... మా మధ్య గొడవలు రావు. నేను కాస్త విభిన్నమైన మనిషిని (నవ్వుతూ). ఎక్కువగా మమ్మల్ని బాధించిన పనుల గురించి చర్చించుకుంటాం. మరోసారి అలా జరగకుండా చూసుకుంటాం. ఇలాంటి సూత్రాలే మా బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంటాయి"