ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సినిమా డైలాగ్స్ నేర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మరో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
జెఫ్ బెజోస్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సినీ రంగానికి చెందిన సెలబ్రెటీలు ఆయన కోసం ప్రత్యేకంగా గురువారం సాయంత్రం ఓ విందును ఏర్పాటు చేశారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, విద్యాబాలన్, కమల్‌హాసన్, భూమి ఫడ్నేకర్, మాధవన్, ఫర్హాన్ అక్తర్ తదితరులు విందులో పాల్గొన్నారు.
అయితే విందుకు ముందు ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో షారుఖ్ తాను నటించిన ‘డాన్’ సినిమాలో 'డాన్ ఖో పకడ్నా ముష్కిల్ నహి.. నా ముమ్మిక్న్ హై..' అనే హిట్ డైలాగ్‌ను జెఫ్‌కు నేర్పించాడు. అంతేకాకుండా 'జెఫ్‌ను అందుకోవడం సాధ్యం కాదు’ అంటూ షారుఖ్ తెలిపాడు. కింగ్ ఖాన్ నేర్పించిన డైలాగ్‌కు ఫిదా అయిన జెఫ్.. 'షారుఖ్ మీరు చాలా చక్కగా నేర్పించారు' అని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరోవైపు షారుఖ్.. జెఫ్, 'గల్లీబాయ్' సినిమా దర్శకురాలు జోయా అక్తర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ' ఎన్నో విషయాలు నేర్చుకున్న ఓ అందమైన సాయంత్రం. జోయా అక్తర్, జెఫ్ బెజోస్‌తో గడపడం చాలా సంతోషంగా ఉంది' అని షారుఖ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఎంజీఆర్ లుక్‌తో అబ్బురపరుస్తుస్న అరవింద్ స్వామి