బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య యావత్ దేశాన్ని విస్మయపరిచింది. జూన్ 14న ముంబయిలోని బాంద్రాలో తన నివాసంలోనే సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందే అతడు ఎన్నో చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. అలాంటి నటుడి కెరీర్‌లో చెప్పుకోగదగ్గ సినిమా 'ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ'. టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. సుశాంత్ కెరీర్‌లోనే అతిగొప్పది. ఇందులో అచ్చం ధోనీలా నటించి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.
'ధోని' క్లైమాక్స్ చూస్తూ సుశాంత్ ఎలా స్పందించాడంటే - సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దోనీ సినిమా
'ధోని' సినిమాలో అచ్చం మహీలానే నటించి అబ్బురపరిచాడు సుశాంత్ సిం. ఈ నటుడు ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అతడికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా 'ధోని' సినిమాలో సిక్స్ కొట్టే సన్నివేశాన్ని స్వయంగా చూసుకుంటూ సుశాంత్ నవ్వుకుంటున్న వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
ధోనీ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డ అతడు నిజ జీవితంలో మాజీ సారథి ఎలా ఉండేవాడో అలానే నటించి మెప్పించాడు. అలాగే క్రికెట్ సన్నివేశాల్లోనూ ధోనీ నడవడికను అచ్చుగుద్దినట్లు అనుకరించాడు. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అలా ఒక్కసారిగా స్టార్ నటుడయ్యాడు సుశాంత్.
ఆ సినిమా చివర్లో ధోనీ 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై సిక్స్ కొట్టే సన్నివేశం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సన్నివేశంలో సుశాంత్ నిజంగా ధోనీలానే బంతిని దంచి కొడతాడు. ఓ సందర్భంలో ఆ క్లైమాక్స్ సీన్ చూస్తున్న సుశాంత్ వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సోఫా మీద కూర్చుని ఆ సినిమా చూస్తున్న అతడు తెరపై ధోనీలా తనని తాను ఊహించుకుని మురిసిపోయాడు. అదెంతో బాగుందనే సైగలు చేస్తూ సరదాగా నవ్వుకున్నాడు.