రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లను దృష్టిలో ఉంచుకొని 'ఆర్ఆర్ఆర్' సినిమా కథను సిద్ధం చేసినట్లు రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇద్దరు స్టార్లతో సినిమా చేస్తున్న కారణంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండడం సహజమని ఆయన అన్నారు. అయితే అటు చరణ్, తారక్ పాత్రలను తక్కువ చేయకుండా.. ఇటు కథను మార్చకుండా సినిమాను తెరకెక్కించామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
"స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలతో కథ అనుకున్నప్పుడు దర్శకుడు రాజమౌళి మదిలో మెదిలిన వారు ఇద్దరే. వాళ్లే రామ్‌చరణ్, ఎన్టీఆర్. ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే వాళ్లతో కలిసి పనిచేశాడు. ఈ నేపథ్యంలో మేము అనుకున్న కథకు వీరిద్దరే న్యాయం చేయగలని భావించాం. అనుకున్న విధంగానే చరణ్, తారక్ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు".
- విజయేంద్ర ప్రసాద్, 'ఆర్ఆర్ఆర్' కథారచయిత
"ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించిన స్టార్ల ఇమేజ్ దెబ్బ తినకుండా.. అదే విధంగా కథను నీరుగార్చకుండా తెరకెక్కించాలనేది మా అభిమతం. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉంటాయి. దీనికి అనుగుణంగా ఎవరి పాత్రను తగ్గించకుండా.. కథా సారాంశం దెబ్బ తినకుండా నిజమైన కథను ప్రేక్షకులకు అందించనున్నాం" రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయ్యింది. ఇటీవలే విడుదలైన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది.
ఇదీ చూడండి..ఒక్క పాట కోసం రూ.3 కోట్ల బడ్జెట్!