హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్.. సినీ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. వచ్చే ఏడాది దాదాపు 17 సినిమాలను.. థియేటర్లతో పాటు హెచ్‌బీఓ మ్యాక్స్‌లోనూ(స్ట్రీమింగ్ యాప్) ఒకేసారి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా భయం లేకుండా అందరూ సినిమాలు చూసేందుకు వీలవుతుందని సంస్థ వెల్లడించింది.
ఒకేసారి అటు థియేటర్, ఇటు ఓటీటీలో! - వార్నర్ బ్రదర్స్ సినిమాలు
'వార్నర్ బ్రదర్స్' నిర్మిస్తున్న దాదాపు 17 సినిమాలు.. అటు థియేటర్, ఓటీటీలో ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని సదరు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ జాబితాను కూడా నెటిజన్లతో పంచుకున్నారు.
యాప్‌లో ఈ చిత్రాలన్నీ 31 రోజులే అందుబాటులో ఉంటాయని, ఆ తర్వాత చూడాలనుకుంటే మాత్రం థియేటర్‌కు రావాల్సిందేనని స్పష్టం చేసింది నిర్మాణ సంస్థ. క్రిస్మస్ కానుకగా రానున్న 'వండర్ ఉమన్ 1984'తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది.
వండర్ ఉమన్ 1984, డూన్, ద సూసైడ్ స్క్వాడ్, గాడ్జిల్లా vs కాంగ్, ద మ్యాట్రిక్స్ 4, ఇన్ ద హైట్స్, క్రై మాకో, 'కంజూరింగ్' సిరీస్‌లోని తర్వాతి భాగం, స్పేస్ జామ్: ఏ న్యూ లెగసీ, కింగ్ రిచర్డ్, ద సోప్రనోస్, ద మెనీ సెయింట్స్ ఆఫ్ నెవర్క్ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.