జూ.ఎన్టీఆర్ అంటే మనకు అతడి పాత్రలు, డైలాగ్స్, ఫైట్స్ టక్కున గుర్తొస్తాయి. ఇలా అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభ చూపించి, అశేష అభిమాన గణాన్ని సంపాదించారు. రోజురోజుకూ వాళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. తారక్ సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చేమో కానీ చేసిన పాత్రలు మాత్రం మనల్ని నవ్వించాయి, ఏడిపించాయి, ఆలోచింపజేస్తున్నాయి. అయితే తనకు నటన మీద ఇష్టాన్ని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. అలాంటిదే ఇది.
దటీజ్ తారక్... గాయమైనా ఒంటి చేత్తోనే షూటింగ్! - NTR VV VINAYAK AADI MOVIE
నటన అంటే ఎన్టీఆర్‌కు ఎంత ఇష్టమో తెలిపే సంఘటనల్లో ఇదొకటి. 'ఆది' షూటింగ్లో ప్రమాదం జరిగిన చేతి నుంచి రక్తం పోతున్నా సరే, చికిత్స చేయించుకుని ఒంటి చేత్తో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా దీని గురించిన వివరాలు మీకోసం.
'ఆది' సినిమా చేస్తున్నప్పుడు 17 ఏళ్ల కుర్రాడు ఎన్టీఆర్. ఓ ఫైట్ సీన్ షూటింగ్లో భాగంగా చేతికి గాయమై, చేతి నుంచి రక్తం బాగా పోతోంది. ఆ సమయంలో జరిగిన విషయాన్ని గతంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైనప్పుడు చిత్ర దర్శకుడ వివి వినాయక్ వెల్లడించారు.
"ఎన్టీఆర్‌కు గాయమవ్వగానే ముందు భయపడిపోయా. చేతి నుంచి రక్తం బాగా పోతుంది. 17 ఏళ్ల కుర్రాడు కదా.. గాయం నొప్పికి బాగా ఏడ్చేస్తున్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో మాకందరికి తోచలేదు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడున్న డాక్టర్ మమ్మల్ని మరింత భయపెట్టేశాడు. చేతి మణికట్టు దగ్గర మృదువైన నరం ఉంటుందని, దాన్ని ఏమి చేయలేక వైజాగ్‌లోని ఆస్పత్రికి వెళ్లమని ఆ వైద్యుడు సూచించాడు. రక్తస్రావం కాకుండా గట్టిగా కట్టు కట్టాం. వాళ్ల అమ్మకు ఫోన్ చేసి 'మమ్మీ.. మమ్మీ' అని తారక్ ఏడ్చేస్తున్నాడు. వైజాగ్ చేరుకుని ట్రీట్మెంట్ చేయించాం. ఆ గాయం తగ్గాక ఆ సన్నివేశాన్ని పూర్తి చేద్దామని తారక్ చెప్పాడు. రాత్రి షూటింగ్ పెట్టి, ఎన్టీఆర్‌పై ఒంటి చేత్తో ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించాం" అని వినాయక్ చెప్పారు.