చిత్రం: పాగల్; నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరీ, మేఘలేఖ, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ, తదితరులు; నిర్మాత: బెక్కెం వేణుగోపాల్; సంగీతం: రాధన్; ఛాయా గ్రహణం: మణికందన్; దర్శకుడు:నరేశ్ కొప్పిలి; నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా; విడుదల తేదీ: 14-08-2021
రెండో దశ కరోనా తర్వాత థియేటర్ల దగ్గర సందడంతా పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలదే. అగ్ర తారల చిత్రాలు ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకపోవడం వల్ల.. చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. అందులో ఈ వారం ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా 'పాగల్'. అగ్ర నిర్మాత దిల్‌రాజు సమర్పించడం, విశ్వక్‌సేన్, నివేదా జోడీ నటించడం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. పాటలు, ప్రచారచిత్రాలు కూడా అలరించాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: ప్రేమ్(విశ్వక్‌సేన్) చిన్నప్పుడే తన తల్లిని కోల్పోతాడు. అమ్మాయిని ప్రేమిస్తే అమ్మప్రేమ లాంటి అనుబంధం దొరుకుతుందని నమ్ముతాడు. అలా 1600 మంది అమ్మాయిల ముందు తన మనసులో ప్రేమని బయట పెడతాడు. కానీ అతని ప్రేమకి తిరస్కారమే ఎదురవుతుంది. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికొస్తాడు. ఇంతలో తీర (నివేదా పేతురాజ్) తనను ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఇంతకీ తీర ఎవరు? నిజంగా ప్రేమ్‌ను ఆమె ప్రేమించిందా? వాళ్లిద్దరి కథ సుఖాంతమైందా? లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: అమ్మాయినే కాదు, లింగ బేధం లేకుండా ఎవరినైనా ప్రేమలోకి దించే ఓ ప్రేమికుడి కథ ఇది. తల్లి ప్రేమ నేపథ్యంలో మొదలవుతుంది. ఆ తర్వాత పలువురు అమ్మాయిల చుట్టూ సాగుతుంది. పేరుకు తగ్గట్టే ఒక విచిత్రమైన కథ ఇది. కథ మొదలుకొని పాత్రల వరకు ఎందులోనూ సహజత్వం కనిపించదు. అమ్మాయి కనిపించగానే రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పే ఓ కుర్రాడు.. ఉన్నట్టుండి ఓ అంకుల్‌కి అదే పువ్వు ఇచ్చి ప్రేమిస్తున్నానని చెబుతాడు. క్రమంగా ఆ అంకుల్ కూడా ఇతని ప్రేమలో పడతాడు. ఈ సన్నివేశాలతో కామెడీ పండటం మాటేమో కానీ.. 'ఇదెక్కడి ప్రేమ' అనుకునే పరిస్థితి వస్తుంది ప్రేక్షకుడికి. ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య ప్రేమలోనైనా, లేదంటే ఇతరత్రా బంధాల్లోనైనా భావోద్వేగాలే ప్రధానం. కానీ ఇందులో తల్లీకొడుకుల బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కానీ.. అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమలో కానీ ఏమాత్రం భావోద్వేగాలు పండవు. ద్వితీయార్థంలో ప్రేమ్, తీర మధ్య కొన్ని సన్నివేశాలు మినహా అంతా బలవంతపు వ్యవహారంలా అనిపిస్తుంది. కథ కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతుంది. రెండు పాటలు, అక్కడక్కడా కామెడీ మినహా సినిమా పెద్దగా ప్రభావం చూపించదు.
ఎవరెలా చేశారంటే: విశ్వక్‌సేన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమికుడిగా హుషారైన పాత్రలో కనిపిస్తాడు. నివేదా పేతురాజ్ ద్వితీయార్థంలోనే కనిపిస్తుంది. తీర పాత్రలో ఒదిగిపోయింది. మహేష్, రాంప్రసాద్ తదితర కామెడీ బృందం కొన్ని సన్నివేశాల్లో నవ్వించింది. రాహుల్ రామకృష్ణ, అతని గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అంతగా మెప్పించవు. మురళీశర్మ కథానాయిక తండ్రిగా కనిపిస్తాడు. భూమిక ఆరంభ సన్నివేశాలకి ఆకర్షణగా నిలుస్తుంది. మిగిలిన పాత్రలు పెద్దగా ప్రభావం చూపించవు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం, కెమెరా పనితనం మెప్పిస్తాయి. దర్శకుడు కథ, కథనాల విషయంలో కొత్తదనం చూపించలేకపోయారు.
బలాలు
విశ్వక్‌సేన్ నటన