'నేనెప్పుడూ సినిమా తొలికాపీ చూశాకే ముందస్తు విడుదల వేడుకలో మాట్లాడతా' అని యువ నటుడు విశ్వక్ సేన్ చెప్పారు. లవర్‌బాయ్‌గా అతడు నటించిన చిత్రం 'పాగల్'. నివేదా పేతురాజ్ నాయిక. నరేశ్ కొప్పిలి దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించారు విశ్వక్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? 'పాగల్' సంగతేంటి? తదితర విషయాలు వెల్లడించారు.
ముందస్తు విడుదల వేడుక (ప్రీ రిలీజ్ ఈవెంట్)లో మీరు మాట్లాడిన విషయాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై ఏమంటారు?
విశ్వక్: నేను నా సినిమా తొలి కాపీ చూసి, ఆ మాటలు అన్నాను. అప్పుడు మాట్లాడిన ఏ మాటనీ నేను వెనక్కి తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ సినిమా చూశాకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతా. సినిమాకు ఎక్కువ, సినిమాకు తక్కువ కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేనే కాదు నా మిత్రులు, దర్శకుడి స్నేహితులు నిన్న సినిమా చూసి 'అన్నా.. నువ్వు పేరు మార్చుకునే పనిలేదు' అని అన్నారు.
ఈ సినిమా ప్రచారానికి బాగా కష్టపడుతున్నట్టున్నారు..
విశ్వక్: తప్పదు కదండి. నాకంటూ ఎవరీ సపోర్ట్ లేదు. చాలాకష్టపడి తీసిన సినిమా. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం కథకు కనెక్ట్ అయి ఈ సినిమా చేస్తాం. చూసిన ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం కదిలిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
మీ గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఎమోషన్ తగ్గినట్టు అనిపిస్తుంది?
విశ్వక్: అలాంటిదేమీ లేదు. ఈ చిత్రంలోనూ భావోద్వేగ సన్నివేశాలున్నాయి. ట్రైలర్‌లో చివరి 30 సెకన్లపాటు ఎమోషన్ ఎలా ఉందో సినిమాలో ఆఖరి 30 నిమిషాలు అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ అందులో లీనమవుతారు. ట్రైలర్ చూసిన చాలామంది 'ఎమోషన్ సీన్లలో బాగా నటించావు' అని నాకు సందేశాలు పంపుతున్నారు.