తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకే తరహా సినిమాలు చేస్తే బోరింగ్: దర్శకుడు విక్రమ్ - movie news

నాగచైతన్య 'థ్యాంక్ యూ' సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు విక్రమ్ కె కుమార్.. పలు ఆసక్తికర అంశాల్ని పంచుకున్నారు. ఒకే తరహా కథలు చేస్తే తనకు బోరింగ్​గా ఉంటుందని చెప్పారు. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి వెల్లడించారు.

vikram k kumar about thank you movie and his future projects
దర్శకుడు విక్రమ్

By

Published : Jun 9, 2021, 7:09 AM IST

కొద్దిమంది దర్శకుల రూటే సపరేటు. ఎప్పుడు ఎలాంటి కథతో సినిమాలు చేస్తారో అస్సలు ఊహించలేం. విక్రమ్‌ కె.కుమార్‌ అంతే. 'ఇష్క్‌', 'హలో' అంటూ ప్రేమరుచుల్ని పంచారు. ‘మనం’తో జన్మజన్మల అనుబంధాల్ని ఆవిష్కరించారు. ‘24’తో కాలాన్ని వెనక్కి ముందుకీ తిప్పుతూ ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేశారు. ఈమధ్య ‘గ్యాంగ్‌లీడర్‌’తో నవ్వించారు. ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథతో సినిమా చేసే ఆయన ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా ‘థ్యాంక్‌ యూ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...

కరోనా ఉద్ధృతిలోనూ ‘థ్యాంక్‌ యూ’ కోసం యూరప్‌ వెళ్లారు. చిత్రీకరణ ఎంతవరకు పూర్తయింది?

అక్కడ కరోనా ఉద్ధృతి ఇక్కడంతగా లేదు. ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. తొలి దశ సమయంలోనే వాళ్లు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. మన దగ్గర వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక సాధారణ పరిస్థితులు రావొచ్చు. మేం అనుకున్నట్టుగానే యూరప్‌లో ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరిగొచ్చాం. ఇంకో ఎనిమిది రోజులు చేస్తే సినిమా పూర్తవుతుంది. ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెల ఆరంభంలో కానీ మళ్లీ రంగంలోకి దిగి మిగిలిన సినిమా పూర్తి చేసేస్తాం. ఆగస్టు తొలి వారంలోపు మొత్తం చేసి నిర్మాత దిల్‌రాజు చేతికి అప్పజెబుతా. ఇక విడుదల ఎప్పుడనేది ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

‘థ్యాంక్‌ యూ’లో ముగ్గురు కథానాయికలు ఉన్నారు. ఇది ముక్కోణపు ప్రేమకథనా?

ఆ విషయాల్ని చెప్పడానికి ఇంకా సమయం ఉంది. మేం ఇంకా ఫస్ట్‌లుక్‌నే విడుదల చేయలేదు. ఈ నెలాఖరు, లేదంటే వచ్చే నెల ఆరంభంలో ఆ పనవుతుంది. ప్రస్తుతానికి చాలా మంచి కథ అని మాత్రం చెబుతాను. సినిమా అందరూ ఆస్వాదించేలా ఉంటుంది.

అక్కినేని కథానాయకులతో తరచూ సినిమాలు చేస్తున్నారు.. కారణమేంటి?

‘మనం’ నుంచి అఖిల్‌, నాగచైతన్య నాకు మంచి స్నేహితులయ్యారు. చైతూకి ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. తను ఇందులో కనిపించే విధానం చాలా బాగుంటుంది. తనకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

‘థ్యాంక్‌ యూ’ తర్వాత నాగచైతన్యతో వెబ్‌సిరీస్‌ చేస్తారని తెలిసింది. నిజమేనా?

వెబ్‌ సిరీస్‌ కోసం కథను సిద్ధం చేస్తున్నా. ఈ లాక్‌డౌన్‌లో నేను చేస్తున్న కొన్ని పనుల్లో అదొకటి. ఇక అందులో ఎవరు నటిస్తారు? ఎప్పుడు మొదలవుతుంది? తదితర విషయాల్ని నిర్మాణ సంస్థలే చెబుతాయి.

నాగచైతన్య

హారర్‌ మొదలుకుని... కుటుంబ కథల వరకు అన్ని రకాల సినిమాలు చేస్తుంటారు. ప్రతి సినిమాలోనూ థ్రిల్లింగ్‌ అంశాలు కనిపిస్తుంటాయి. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయడం ఇష్టమా?

ఒకే తరహా సినిమాలు చేస్తే బోరింగ్‌గా ఉంటుంది. అందుకే నా సినిమాల్ని మరో భాషలో రీమేక్‌ చేయమన్నా చేయను. వేరేవాళ్లు తీసిన సినిమాల్ని రీమేక్‌ చేయమన్నా ఇష్టం ఉండదు. చెప్పిన కథని మళ్లీ ఎన్నిసార్లు చెబుతాం అనిపిస్తుంది. కొత్త రకమైన కథలతో ప్రయాణం చేయడమే నాకు బాగుంటుంది. ఇక థ్రిల్లింగ్‌ అంశాలంటారా? అవి ఉంటే కథకు వేగం వస్తుంది. ఆ అంశాల్ని కథలో భాగంగా జోడించడానికే ఇష్టపడుతుంటా.

దర్శకుల్లో మీపై ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది?

నా గురువు ప్రియదర్శన్‌ మొదలుకుని రామ్‌గోపాల్‌ వర్మ, మణిరత్నం ఇలా చాలా మంది దర్శకులు నాకు స్ఫూర్తి. రాజు హిరాణీ, సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాల్ని బాగా ఇష్టపడుతుంటా. వాళ్ల ప్రభావం నాపై ఎంత ఉంటుందనేది మాత్రం నేను చెప్పలేను. ఒకొక్క కథ ఒక్కోలా ఉంటుంది కాబట్టి... ఆ కథల్ని నేనెంత ఆసక్తికరంగా చెప్పగలననే విషయంపైనే నా దృష్టి ఉంటుంది.

అల్లు అర్జున్‌తో చిత్రం చేయాలనుకున్నారు కదా! ఎంతవరకు వచ్చింది?

ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నాకు అదొక కలల ప్రాజెక్ట్‌ తరహా చిత్రం. స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నా. అది అందరికీ నచ్చితే తప్పకుండా మా కలయికలో సినిమా మొదలవుతుంది.

పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంది? మీ సినిమాలకి సంబంధించి మీ అర్ధాంగి శ్రీనిధి ఏమైనా సలహాలిస్తుంటారా?

పెళ్లయిన వెంటనే సినిమాలతో బిజీ అయిపోయా. కరోనా వల్ల ఒకటిన్నర యేడాదిగా కుటుంబంతో కలిసి గడిపే అవకాశం వచ్చింది. వైవాహిక జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నా. నా భార్య శ్రీనిధి సినిమా రంగానికి చెందిన వ్యక్తే కదా. సృజనాత్మకత కలిగిన వ్యక్తి. సౌండ్‌ డిజైనర్‌గా ఎ.ఆర్‌.రెహమాన్‌ దగ్గర పనిచేసింది. ప్రస్తుతం అనిరుధ్‌ దగ్గర చేస్తోంది. తన అభిప్రాయానికి చాలా విలువనిస్తుంటా. ఒక మంచి సన్నివేశం వచ్చినా, సంభాషణ తట్టినా మొదట ఆమెకే చెబుతాను. బాగోలేదంటే అక్కడే వదిలేస్తాను. ఇప్పుడు శ్రీనిధి నాకు తొలి ఫిల్టర్‌ అన్నమాట. బాగుందనే మాట తన నుంచి వచ్చిందంటే అది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే ఓ నమ్మకం. నా సినిమాల్లో ‘గ్యాంగ్‌లీడర్‌’ అంటే తనకు చాలా ఇష్టం.

ఆ సినిమా ఫలితం మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేసిందా?

నాకు బాగా ఇష్టమైన సినిమా అది. ప్రతీకారం - కామెడీ మిళితమైన ఒక భిన్నమైన జోనర్‌. మన సినిమాల్లో హీరోలకు ప్రతీకారం ఉంటుంది. ఇందులో కథ పూర్తి భిన్నం. దర్శకుడిగా నాకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రం. ఆద్యంతం నవ్వుకుంటూ తీశా. కథానాయకుడు నానికి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం హిందీ, తమిళం, మలయాళంలో రీమేక్‌ అవుతోంది. ఒక దర్శకుడికి ఇంతకంటే తృప్తి ఏముంటుంది? అనుకున్న కథను అనుకున్నట్టుగా తీయడం కోసం దర్శకుడిగా కష్టపడి పనిచేయాలి. ఇక ఆ సినిమాల హిట్‌, ఫ్లాప్‌ అనే విషయాలు మన చేతుల్లో ఉండవు. నువ్వు తీసిన సినిమా విజయం సాధిస్తే శుక్ర, శని, ఆది వారాలు సంతోషించు, ఒక వేళ ఫ్లాప్‌ అయినా ఆ మూడు రోజులే బాధపడు. సోమవారం నుంచి కొత్త సినిమా పనుల్ని మొదలుపెట్టమని ఒక పెద్దాయన నాతో చెప్పాడు. నేను అదే సూత్రాన్ని అనుసరిస్తుంటా.

ఇప్పటిదాకా మీరు చేయని కొత్త జోనర్‌లో ఏదైనా సినిమా చేసే ఆలోచన ఉందా?

యానిమేషన్‌ సినిమా ఒకటి చేస్తాను. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌ అది. దానికి మూడు నాలుగేళ్లు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. స్క్రిప్టు అయితే యాభై శాతం పూర్తయింది. మరో యేడాది తర్వాత దాని పూర్వ నిర్మాణ పనులు మొదలవుతాయి. సంగీతం ప్రధానంగా సాగే ఆ సినిమా గురించి ఎ.ఆర్‌.రెహమాన్‌తో కూడా చర్చించా. ఆయనకు బాగా నచ్చింది. ఆ సినిమా పట్టాలెక్కించేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.

తెలుగు ప్రేక్షకులు అత్యుత్తమం

ఇంత మంచి పరిశ్రమలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. కేరళ నుంచి వచ్చిన నేను తెలుగు సినిమాలు తీయడమేమిటి? బయట రాష్ట్రం నుంచి వచ్చి తెలుగులో సినిమాలు తీసిన దర్శకులు చాలా తక్కువమంది. అందులో నేనొక్కడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. నా దృష్టిలో అత్యుత్తమ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు. సినిమాపై ఇంత ప్రేమ ఉన్న ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడా లేరు. గొప్ప నటులు, గొప్ప నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అవకాశాన్నిచ్చింది ఈ పరిశ్రమ. ఆ విషయంలో నేనెప్పటికీ రుణపడి ఉంటా. దర్శకుడిగా ఇంకా గొప్ప కథలు చెప్పడానికి ప్రయత్నిస్తా.

వాటి నుంచి స్ఫూర్తి

‘‘వెండితెరపై చూపించాల్సిన కథలు కొన్ని ఉంటాయి. ఓటీటీ వేదికలపై చెప్పాల్సిన కథలు కొన్ని ఉంటాయి. వీటిలో దేనికేదీ పోటీ కాదు. థియేటర్‌ ప్రాభవం ఎప్పటికీ తగ్గదు. ఓటీటీ వేదికల వల్ల మంచే జరుగుతోంది. యువ దర్శకులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ కావల్సింది అవకాశమే. వాటిని ఎలా వినియోగించుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఓటీటీ లక్ష్యంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కథల విషయంలో నిజ జీవితాల నుంచే స్ఫూర్తి పొందుతుంటా. నాకు డ్రామా, భావోద్వేగాలంటే ఇష్టం’’.

ABOUT THE AUTHOR

...view details