తెలుగు చిత్రసీమలోనే కాకుండా దక్షిణాది మొత్తంలో విజయశాంతి పేరు తెలియని వారుండరు. తెరపై విజయశాంతి కనిపిస్తే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేగేది. విజయశాంతి యాక్షన్ సన్నివేశాలు అభిమానులను మళ్లీ మళ్లీ సినిమా హాళ్లకు రప్పించేవి. ఇలా అందం, అభినయం కలగలిసిన విజయశాంతి దాదాపు 180 చిత్రాల్లో హీరోయిన్గా మురిపించింది.
వివిధ చిత్రాల్లో... విజయశాంతి తెలుగు చిత్రసీమలో టాప్ హీరోలు అందరితోనూ నటించి అలరించిన అందాల తార విజయశాంతి.
ఆమె నటించిన 'ఒసేయ్ రాములమ్మ' వంటి చిత్రాలు టాప్ హీరోస్ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించాయి. 'స్వయంకృషి'లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
పుట్టింది ఇక్కడే...
విజయశాంతి 1966, జూన్ 24న వరంగల్‌లో జన్మించింది. తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది.
అవార్డులు...
- 'కర్తవ్యం' సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచింది విజయశాంతి.
- 7 సార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలు గెలుచుకుంది.
- ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకొంది.
- 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందింది.
- నాలుగుసార్లు నంది పురస్కారాలను అందుకుంది.
విశేషాలు...
1990లలో కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమా రెమ్యూనరేషన్ కోటి రూపాయలు. ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ అదే. ఆమె 1998లో రాజకీయ రంగంలోకి ప్రవేశించింది.
సెకండ్ ఇన్నింగ్స్...
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇది. ఆమె పాత్రపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.