'వస్తాడు ..నా రాజు ఈరోజూ అంటూ'.. అమయాకపు చూపులతో ప్రియుడు కోసం ఎదురుచూస్తున్న యువతి పాత్రలో మెప్పించిన నటి విజయనిర్మల. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా తన ప్రతిభాపాటవాలను చాటిన విజయనిర్మల అనారోగ్యంతో మృతి చెందారు. ఎన్నో ఘనతలను సాధించిన విజయ నిర్మల ప్రస్థానం సాగిందిలా..
కుటుంబ నేపథ్యం..
విజయనిర్మల మద్రాసులో 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. తండ్రి రామ్మోహనరావు, తల్లి శకుంతలాదేవి. ప్రముఖ గాయని రావు బాలసరస్వతిదేవి.. విజయనిర్మల మేనత్త కూతురే. మరో నటి జయసుధ పెద్దనాన్న మనవరాలు. చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు విజయనిర్మల. సినిమా నేపథ్యమే కావడంతో బాలనటిగా తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు.
బాలనటిగా మెప్పించిన విజయనిర్మల..
దర్శకుడు పి. పుల్లయ్య ‘మత్సరేఖ’ (1953) తమిళ సినిమాలో విజయనిర్మలకు బాలనటిగా అవకాశమిచ్చాడు. అనంతరం సింగారి, మనంపోల్ మాంగల్యం.. హిందీ చిత్రం హమ్ పంఛీ ఏక్ డాల్ లాంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించారు విజయనిర్మల. తెలుగులో పాండురంగ మహత్యం, జయకృష్ణా ముకుందా మురారి, భూకైలాస్ లాంటి చిత్రాల్లో నటించారు. బాలనటిగా భూకైలాస్ ఆఖరు చిత్రం.
మలయాళ చిత్రంతో హీరోయిన్గా అరంగేట్రం..
1964లో వచ్చిన మలయాళ చిత్రం భార్గవి నిలయంతో హీరోయిన్గా అరంగేట్రం చేశారు విజయనిర్మల. తెలుగులో రంగులరాట్నం చిత్రంతో కథానాయికగా పరిచమయ్యారు. అక్కడి నుంచి దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. అనంతరం పెళ్లికానుక సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేశారు.
సూపర్‌స్టార్ కృష్ణతో వివాహం..
తొలిసారి సాక్షి చిత్రంలో కృష్ణ సరసన నటించారు విజయనిర్మల. అనంతరం వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో వీరిద్దరిది హిట్ పెయిర్. 1969 మార్చి 24న తిరుపతిలో కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల. పెళ్లైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తారని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత సూపర్‌స్టార్‌తో కలిసి 50 సినిమాల్లో నటించారు. కృష్ణ కంటే ముందు కృష్ణమూర్తిని(నటుడు నరేశ్ తండ్రి) పెళ్లి చేసుకున్నారు విజయనిర్మల.
కుమారుడు నరేశ్ కూడా సినీనటుడే. ప్రస్తుతం మూవీ ఆర్ట్స్ అసొసియేషన్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నాడు.
దర్శకురాలిగా గిన్నీస్ రికార్డు..
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. 2002లో ఈ ఘనత సాధించారు. అంతకంటే ముందు ఇటలీ దర్శకురాలు పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు.
గిన్నీస్ రికార్డు అందుకున్న విజయనిర్మల
1971లో 'మీనా' అనే చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్న విజయనిర్మలకు 2009లో వచ్చిన 'నేరము - శిక్ష' చిత్రం దర్శకురాలి ఆఖరి సినిమా. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలతో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
దర్శకురాలిగా 44 చిత్రాలు తీసిన విజయనిర్మల
విజయ నిర్మల విశేష సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును ఇచ్చి గౌరవించింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు.