'విజయ నిర్మల.. ఏ-1 పని రాక్షసి'
టాలీవుడ్ మహిళా దర్శక దిగ్గజం విజయనిర్మల మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అభిప్రాయం వ్యక్తం చేశారు సినీ విజ్ఞాన విశారద నంది అవార్డు గ్రహీత ఎస్వీ రామారావు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామారావు.
దాదాపు 60ఏళ్ల సినీ ప్రస్థానంలో నటిగా, దర్శకురాలిగా ఎన్నో భిన్న పాత్రలు పోషించారు విజయ నిర్మల. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి ఏ మహిళా దర్శకురాలూ సాధించలేని ఘనతను సాధించడమే కాదు, గిన్నిస్ రికార్డునూ సొంత చేసుకున్నారు. నటిగానూ అలరించిన ఆమె... కృష్ణతో కలిసి ఒక హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఏకంగా 47 చిత్రాల్లో నటించారు. ఇదొక రికార్డు. ఇంత వరకూ ఏ జోడీ కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు. దర్శకురాలిగా విజయవంతమైన ఆమె... ప్రస్తుత మహిళా దర్శకులందరికీ మార్గదర్శిగా నిలిచారని అభిప్రాయం వ్యక్తం చేశారు సినీ విజ్ఞాన విశారద నంది అవార్డు గ్రహీత , రచయిత ఎస్వీ రామారావు. విజయ నిర్మల ఏ-1 పని రాక్షసి అంటూ పేర్కొన్నారు.