మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, జూ.ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్'తో బిజీగా ఉన్న తారక్.. తర్వాత త్రివిక్రమ్‌తోనే పనిచేయనున్నారు. అయితే ఆ చిత్ర ప్రారంభానికి ముందే దాని గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతినాయకుడి పాత్రపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. కొంతకాలం క్రితం సునీల్ శెట్టి పేరు వినిపించగా, ఇప్పుడు మరో వార్త ఆసక్తి రేపుతోంది. ఇటీవల విలన్ పాత్రలకు కేరాఫ్‌గా మారిన విజయ్ సేతుపతిని ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టబోతున్నాడట.
జూ.ఎన్టీఆర్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి!
తారక్ తర్వాతి సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో విజయ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆదరణ పొందడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.
ఇటీవల విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించిన 'మాస్టర్', 'ఉప్పెన' బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టాయి. దీంతో విజయ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీనికి తోడు ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' భారీ విజయం సాధించింది. అందులోనూ ప్రతినాయకుడిగా తమిళ నటుడు సముద్రఖని నటించాడు. దీంతో త్రివిక్రమ్ మరోసారి తమిళ నటుడిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తన కథలో తారక్‌ను ఎదుర్కొనే విలన్‌గా ఇప్పుడున్న నటుల్లో విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతారనేది మరో వార్త. అయితే.. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకడం మాత్రం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.