తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన కొత్త చిత్రం 'మాస్టర్' విడుదలపై కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత నిర్ణయించినా.. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆగస్టు నెలలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా ఆగస్టులో విడుదలకు సిద్ధమైన సినిమాలు ఇవేనంటూ ఓ లిస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇందులో 'మాస్టర్' చిత్రం కూడా ఉండటం వల్ల మరింత ఆసక్తి నెలకొంది.
అయితే, ఇవన్నీ అవాస్తవమని తేలిపోయింది. 'మాస్టర్' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్రబృందం తెలిపింది. వైరల్‌గా మారిన ఆ లిస్టులో ఉన్నది 2016లో 'మాస్టర్' పేరుతో వచ్చిన కొరియన్ సినిమా అని స్పష్టం చేసింది.