దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారికి అవగాహన ముఖ్యమని గ్రహించిన ప్రభుత్వం సెలబ్రిటీస్తో సందేశం ఇప్పిస్తోంది. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కరోనాపై ప్రజలను అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేశారు.
'కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాను తరిమేద్దాం' - విజయ్ దేవరకొండ కరోనా జాగ్రత్తలు
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో సందేశం ఇచ్చారు నటుడు విజయ్ దేవరకొండ. భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
"కొవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కానీ మనం అందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుని, మనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు కన్పించినా వెంటనే చికిత్స తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. మీకు దగ్గు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయంటే అది కరోనా అయి ఉంటది. వెంటనే డాక్టర్తో మాట్లాడి చికిత్స ప్రారంభించండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రంలో, ఏరియా హాస్పిటల్స్లో, బస్తీ దవాఖానాల్లో కొవిడ్ అవుట్ పేషెంట్ డాక్టర్లను పెట్టారు. మీరు వాళ్లతో మాట్లాడొచ్చు. ఏ లక్షణాలు కనిపించినా అందరికీ దూరంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకోండి. సమయం వృథా చేయకండి. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లినా కొన్ని మందులను ఒక కిట్ రూపంలో ఇస్తారు. భయపడకండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆ వీడియోలో విజయ్ దేవరకొండ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.