గతేడాది 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తరువాత చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ కథానాయికగా చేస్తోంది. కరోనా వైరస్ వల్ల ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగానే చిరు సొంత సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకొంది. అయితే తాజాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండను కీలక పాత్రలో నటింపజేసేందుకు సంప్రదించారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
మెగాస్టార్ చిత్రంలో రౌడీ బాయ్.. నిజమేనా! - చిరంజీవి లూసిఫర్ రీమేక్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ తెరకెక్కనుంది. 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఓ కీలక పాత్రను ఇక్కడ విజయ్ దేవరకొండ చేయనున్నారట. అయితే అధికారికంగా ఈ వార్తను ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. ఇప్పటికే విజయ్.. మెగాస్టార్ బావ అల్లు అరవింద్ నిర్మించిన 'గీతగోవిందం' చిత్రంలో కథానాయకుడిగా నటించారు. మరొక చిత్రం 'టాక్సీవాలా'ను యువీ క్రియేషన్స్ తో కలిసి గీతా ఆర్ట్స్ నిర్మించింది.
'లూసిఫర్' చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు పేరు కూడా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకొంటున్న 'ఫైటర్'లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా కనిపించనుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా కొవిడ్-19 అదుపులోకి వచ్చాకనే మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు.