విజయ్ దేవరకొండ.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, ట్యాక్సీవాలా చిత్రాలతో తానెంటో నిరూపించుకుని ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. విజయ్ ఇంతటి స్టార్డమ్ సంపాదిస్తాడని అతడి కుటుంబ సభ్యులే ఉహించలేదట. ఈ విషయాన్ని విజయ్ బంధువు, నిర్మాత అయిన యష్ రంగినేని ఒకానొక సందర్భంలో చెప్పారు.
"'ఎవడే సుబ్రహ్మణ్యం' విడుదల తర్వాత ఫోన్ చేసి విజయ్‌కి శుభాకాంక్షలు చెప్పాను. అప్పటికి మా అన్నయ్యకు విజయ్‌పై నమ్మకం లేదు. కుటుంబ సభ్యులంతా సినిమాలు వద్దన్నాం. నాకూ ఇష్టం లేదు. 'పెళ్లి చూపులు' సినిమాకు డబ్బులు కావాలని నన్ను అడిగాడు. ఆ సమయంలో రాజ్ కందుకూరి, నేను కలిసి ఆ చిత్రానికి పెట్టుబడి పెట్టాం. మొత్తం రూ.60 లక్షల పెట్టుబడిలో చెరో సగం వేసుకున్నాం. ఆ సినిమా సమయంలో విజయ్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని నేనే కాదు అతడి నాన్న కూడా అనుకోలేదు." -యష్ రంగినేని, నిర్మాత