విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా 'లైగర్'. ఇటీవల ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో విజయ్ పూర్తి మాస్ లుక్‌లో కనిపించారు. 'లైగర్' ఫస్ట్‌లుక్‌పై ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు పాలాభిషేకాలు, తీన్‌మార్ డ్యాన్స్‌లు, కేక్ కటింగ్స్‌తో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమకు విజయ్ భావోద్వేగానికి గురయ్యారు.
"మీరే నా ప్రేమ (అభిమానులను ఉద్దేశిస్తూ). 'లైగర్' టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైన రోజు మీరు నన్ను ఎంతగానో భావోద్వేగానికి గురి చేశారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యాను. ప్రేక్షకుల్లో ఒక్కరైనా నా నటనను గుర్తిస్తారా? నా సినిమాలు చూడడానికి థియేటర్‌కు వస్తారా? అని ఒకానొక సమయంలో ఎంతో బాధపడేవాడిని. 'లైగర్' పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఎన్నో ప్రాంతాల్లో జరిగిన సెలబ్రేషన్స్ చూసి నాకెంతో ఆనందంగా అనిపించింది. టీజర్ విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి వేడుకలే జరుగుతాయని గ్యారంటీ ఇస్తున్నా.. నా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీ విజయ్ దేవరకొండ."