తెలుగు చిత్ర పరిశ్రమలో 'కిల్ ఫేక్ న్యూస్' నినాదం ఊపందుకుంది. అసత్య వార్తలు రాస్తున్న వెబ్‌సైట్ల భరతం పట్టాల్సిందే అంటూ సినీ తారలు, దర్శకనిర్మాతలు ఒక తాటిపైకి వస్తున్నారు. అందుకోసం కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ గళం విప్పడంతో ఈ ఉద్యమం మొదలైంది. కరోనా విపత్తుతో సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం చేసేందుకు విజయ్ దేవరకొండ ఇటీవల తన 'ది దేవరకొండ ఫౌండేషన్' తరఫున మిడిల్‌క్లాస్ ఫండ్ పేరుతో సహాయనిధిని ఏర్పాటు చేశారు. దాని ద్వారా అవసరార్థులకు నిత్యావసరాల్ని అందిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్ని విమర్శిస్తూ ఓ వెబ్‌సైట్ ప్రచురించిన కథనాలు విజయ్ దేవరకొండకు ఆగ్రహం కలిగించాయి. 'కొన్ని వెబ్‌సైట్లు విపరీతంగా వదంతులు రాస్తున్నాయి. నా కెరీర్‌ను, పేరును నాశనం చేయాలని చూస్తున్నారు కొంతమంది. ఇలాంటి అసత్య వార్తల వల్ల చాలా మంది బాధపడుతున్నారు. చిత్ర పరిశ్రమ ఇంకా బాధపడుతోంది. అయినా ఇన్నాళ్లూ క్షమిస్తూ వచ్చా. ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది' అంటూ విజయ్ ఓ వీడియోను సామాజిక అనుసంధాన వేదికల ద్వారా పంచుకున్నారు. దీనిపై చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు తదితర అగ్ర కథానాయకులు స్పందించి విజయ్‌కి మద్దతుగా నిలిచారు.
"ఎన్నో ఏళ్ల తపన, శ్రమ, అంకితభావంతో ప్రజల్లో ఈ ప్రేమ, గౌరవాలు పొందుతాం.గుర్తింపు లేని కొందరు వ్యక్తులు డబ్బు వ్యామోహంతో మన గౌరవ మర్యాదలు పోగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వాటి నుంచి మన అందమైన చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని, మన పిల్లల్ని సురక్షితంగా ఉంచాలి. ఇలాంటి వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని చిత్ర పరిశ్రమకు పిలుపునిస్తున్నా"
-మహేశ్, మహేశ్.
"ప్రియమైన విజయ్.. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. బాధ్యత లేని రాతల వల్ల మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమంతా నీకు అండగా ఉన్నాం"