విద్యుల్లేఖా రామన్.. నటిగా, లేడీ కమెడియన్‌గా తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తుంటుందీ చెన్నై చిన్నది. అంతేకాదు.. తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. ఇక సంజయ్.. కీటో డైట్ ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 'కీటో చెన్నై'పేరుతో కీటో డైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే గతేడాది ఆగస్టులోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
ఇరు సంప్రదాయాల ప్రకారం!
ఎంగేజ్‌మెంట్ తర్వాత వీళ్లిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తాజాగా తెరపడింది. సెప్టెంబర్ 9న తమ వివాహం జరిగినట్లు ఓ పెళ్లి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ చెప్పుకొచ్చిందీ లేడీ కమెడియన్. తమిళ, సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహానికి చెన్నై వేదికగా నిలిచింది.
తమిళ పెళ్లిలో పట్టు చీర-పట్టు పంచెలో మెరిసిపోయిన వధూవరులు.. సింధీ వెడ్డింగ్ కోసం కాస్త ట్రెడిషనల్ కమ్ ట్రెండీ అవుట్‌ఫిట్స్‌ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో విద్యుల్లేఖ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియానీ రూపొందించిన ఎరుపు రంగు భారీ ఎంబ్రాయిడరీ లెహెంగాలో ముస్తాబవగా.. సంజయ్ క్రీమ్ కలర్ షేర్వాణీకి జతగా ఎరుపు రంగు దుపట్టా ధరించాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తున్న ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది విద్యుల్లేఖ. అలాగే వీళ్ల పెళ్లి, ఇతర పెళ్లి వేడుకలకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంటూ మురిసిపోయారీ లవ్లీ కపుల్. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట ఒక్కటైంది.
డేటింగ్ యాప్‌లో కలిశాం!
ప్రేమించుకొని, పెద్దల అనుమతితో ఒక్కటైన ఈ అందాల జంట.. తమ ప్రేమ కబుర్లను ఇటీవలే ఓ డేటింగ్ యాప్ నిర్వహించిన 'Q&A' సెషన్‌లో భాగంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది బుజ్జీమా.
మీరిద్దరూ ఎలా కలిశారు?
విద్యుల్లేఖ: నా పనిలో నేనెప్పుడూ బిజీగా ఉంటాను. కాబట్టి కొత్త వాళ్లను కలిసేంత సమయం దొరకడమే గగనం. ఈ క్రమంలోనే 2019లో సంజయ్‌ని డేటింగ్ యాప్‌లో కలిశాను. మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి.. కట్ చేస్తే రెండేళ్ల తర్వాత పెళ్లితో ఒక్కటయ్యాం.
మీ ఫస్ట్ డేట్ గురించి చెప్పండి!
సంజయ్: తనెంతో చలాకీ అమ్మాయి. ఓరోజు సరదాగా అలా బయటికి వెళ్దామని అడిగా.. తను ఓకే అంది. అయితే ఆ సమయంలో నేను కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. కానీ కాసేపటి తర్వాత ఆ ఫీలింగ్ దూరమై.. ఇద్దరం ఎన్నో రోజుల నుంచి తెలుసన్న భావన కలిగింది.