ఇప్పటికే పలు హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాల్లో నటించి సత్తా చాటింది విద్యా బాలన్. ఇప్పుడు 'షేర్నీ'(Sherni) సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమైంది. ఇందులో అటవీ శాఖ అధికారిణిగా నటించింది. అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా విద్యా బాలన్(Vidyabalan) చెప్పిన సంగతులివీ..
"తమ జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తున్న మహిళలందరికీ ఈ చిత్రం ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశంలోని ప్రతి ఇంట్లోనూ ఓ షేర్నీ(ఆడపులి) ఉంది. అయితే చాలా సందర్భాల్లో ఆమె వెలుగులోకి రాలేకపోతుంది. అందుకోసం ప్రతిసారి గర్జించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు చాలా మార్గాలున్నాయి. ఈ సినిమాలోని నా పాత్ర రిజర్వుడ్‌గా ఉంటూనే బలమైన సంకల్పంతో సాగుతుంది. దాన్ని చూసి మనకు మనం ఎలా ఎదగాలో తెలుసుకోవచ్చు. ప్రతి మహిళా ఓ పులి అని నేను నమ్ముతా. ఎందుకంటే జీవితమనే అడవిలో ఆమె తన మార్గాన్ని అన్వేషిస్తుంది. తనకు కావాల్సింది సాధించుకునేందుకు ప్రతి మహిళా అడుగడుగునా ఎన్నో సమస్యలకు లోనవుతుందనే విషయం నాకు తెలుసు. నేను కావాలని స్ఫూర్తిన్నిచ్చే చిత్రాల్ని ఎంపిక చేసుకునే ప్రయత్నం చేయను. ఒకవేళ నేను ఎంపిక చేసుకున్న సినిమాలు స్ఫూర్తినిస్తే అది నాకు బోనస్ అని ఫీలవుతా. నేను ఎప్పుడూ బలమైన కథల్ని, నిజాయతీగా ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకుంటాను. ఫిమేల్ సెంట్రిక్ కథల్లో హీరోలా నటించేందుకు ఇష్టపడతా" అని విద్యాబాలన్ వెల్లడించింది.