విక్టరీ వెంకటేశ్ 'అసురన్' తెలుగు రీమేక్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా జనవరి 20 నుంచి పట్టాలెక్కనుంది. వెంకీకి జోడీగా ప్రియమణి కనిపించనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. తమిళ చిత్రం 'అసురన్'లో.. ధనుష్ ద్విపాత్రాభినయంతో మెప్పించాడు. అయితే వెంకీ ఒక్క పాత్రకే పరిమితం కానున్నట్లు సమాచారం.
మాస్ లుక్‌లో...
ఈ చిత్రంలో వెంకటేష్ పల్లెటూరికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ఆయన కొత్తగా ముస్తాబయ్యారు. మీసం మెలేశారు. చిత్రంలో రఫ్ లుక్‌లో, మొరటు మనిషిగా దర్శనమివ్వబోతున్నారు. రాయలసీమలోని ఓ ప్రాంతంలో తొలి షెడ్యూల్‌ని తెరకెక్కించబోతున్నారు. ఇక్కడ దాదాపు 30 రోజులు షూటింగ్ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా గురించి వెంకటేశ్ మాట్లాడాడు.
" ఈ సినిమాలో నా లుక్కే కాదు. నా హావభావాలు కూడా భిన్నంగా ఉండబోతున్నాయి. చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి వెళ్లకముందే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాలనుకున్నా"
-- వెంకటేశ్, సినీ నటుడు
మరో హీరోగా రానా..?
ఈ సినిమాలో మధ్య వయస్కుడిగా వెంకటేశ్ నటించనుండగా... కుర్ర హీరో పాత్ర కోసం రానా పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే దగ్గుబాటి హీరోలు కలసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. సరైన కథ దొరికితే దగ్గుబాటి మల్టీ స్టారర్‌కి సిద్ధమే అని వెంకటేశ్, రానా ఇదివరకే ప్రకటించారు. రానాతో పాటు మరికొంతమంది యువ నటుల పేర్లూ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్టుని పూర్తిగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా ఉండేలా మార్పులు చేర్పులు చేసినట్లు సినీవర్గాల సమాచారం. దాదాపు రెండు నెలల్లో సినిమా పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుందట. అన్నీ అనుకూలిస్తే 2020 వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 'ఎఫ్2', 'వెంకీమామ' సినిమాల విజయాలతో మంచి జోరుమీదున్న వెంకటేశ్ తీస్తున్న తర్వాతి సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.