డ్రగ్స్ తీసుకున్నారంటూ తమపై వచ్చిన విమర్శలపై ఆవేదన వ్యక్తం చేశాడు విక్కీ కౌశల్. ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయానని, చాలా బాధపడ్డానని తెలిపాడు.
"ఈ వీడియో తీయడానికి ఐదు నిమిషాల ముందు వరకూ కరణ్ వాళ్ల అమ్మ మాతోనే ఉన్నారు. పార్టీ అయిపోయాక ఇండియన్ ఆర్మీతో గడపడానికి నేను అరుణాచల్ ప్రదేశ్ వెళ్లిపోయా. అక్కడ ఉన్న నాలుగు రోజులు సిగ్నల్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలియలేదు. ఎంతో ఆనందంగా వచ్చిన నేను ట్విట్టర్ చూసి ఆశ్చర్యపోయా. అప్పటికే ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలయిపోయింది.
-విక్కీ కౌశల్, నటుడు
అసలేం జరిగింది?
బాలీవుడ్ నటుడు, నిర్మాత కరణ్ జోహర్ గత నెలలో తన ఇంట్లో ఓ పార్టీ ఇచ్చాడు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొనే, విక్కీ కౌశల్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, రణ్బీర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను తీసి.. ట్విట్టర్లో పంచుకున్నాడు కరణ్. ఈ విషయంపై భాజపా ఎమ్మెల్యే మనిజిందర్ శిర్షా వీరంతా డ్రగ్స్ తీసుకున్నారంటూ విమర్శిస్తూ ట్వీట్ చేశారు.