యువ నటుడు విక్కీ కౌశల్.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తున్నాడు. ఇతడు, బాలీవుడ్ బార్బీ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నట్లు కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో సందడి చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఈ జంట ప్రేమలో ఉన్నది నిజమేనని చెప్పకనే చెప్పాడు నటుడు హర్షవర్ధన్ కపూర్.
ఓ చాట్ షోలో పాల్గొన్నాడు హర్షవర్ధన్. ఇందులో.. 'సినీ ఇండస్ట్రీలో నిజమైన రిలేషన్షిప్ ఎవరిది?' అని అడిగిన ప్రశ్నకు 'విక్కీ, కత్రిన కలిసున్నారనేది నిజం' అని బదులిచ్చాడు. తక్షణమే 'ఇది చెప్పినందుకు నేనేమైనా ఇబ్బందుల్లో పడతానా?' అని అన్నాడు. దీంతో విక్కీ, కత్రినా డేటింగ్లో ఉన్నట్లు స్పష్టమైంది! ఏదేమైనప్పటికీ ఇది నిజమో కాదో తెలియాలంటే వారిద్దరూ స్పందించేవరకు వేచి ఉండాల్సిందే.