'సాండ్ కీ ఆంఖ్' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు తాప్సి, భూమి పడ్నేకర్. ప్రపంచంలోనే వయో వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ అనే మహిళల జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 82 ఏళ్ల ప్రకాషి తోమర్‌గా తాప్సి, 87 ఏళ్ల చంద్రో తోమర్‌గా భూమి కనిపించనున్నారు.
'సాండ్ కీ ఆంఖ్' చిత్రబృందానికి ఉపరాష్ట్రపతి 'ఆల్ ది బెస్ట్'
బాలీవుడ్ సినిమా 'సాండ్ కీ ఆంఖ్' చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సినిమా చాలా బాగుందన్న ఆయన... తాప్సి, భూమి పడ్నేకర్ నటనను మెచ్చుకున్నారు.
తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ నిర్మించారు. అక్టోబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.
శనివారం 'సాండ్ కి ఆంఖ్' చిత్ర బృందంతో కలిసి సినిమాను చూశానని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఇది నిజ జీవితం ఆధారంగా తీసిన ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా అని ప్రశంసించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ కూడా పాల్గొన్నారు.