మామా అల్లుళ్లు వెంకటేశ్ - నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ 'వెంకీమామ'. గతంలో వీరిద్దరూ 'ప్రేమమ్'లో ఓ సన్నివేశంలో మాత్రమే కలిసి నటించారు. ఈ సినిమాలో పూర్తిస్థాయిలో కనిపించబోతున్నారు. అయితే విడుదల తేదీపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. దీనికి తెరదించుతూ వినూత్నంగా రిలీజ్ డేట్‌ను వెల్లడించింది చిత్రబృందం. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించింది.
విడుదల తేదీ రానా చెవిలో
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'వెంకీమామ' విడుదల తేదీ గురించి తెగ చర్చ జరుగుతోంది. చిత్రబృందం ఎక్కడికెళ్లినా 'సినిమా ఎప్పుడు' అనే ప్రశ్న ఎదురవుతోంది. దీన్నే చిత్రబృందం సినిమా విడుదల తేదీ కోసం ఉపయోగించుకుంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రశ్నలను చూసిన రానా నేరుగా దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లి సినిమా ఎప్పుడు విడుదల చేస్తావు అని అడుగుతాడు. సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో చెబుతాడు. అప్పుడు రానా చెవిలో బాబీ రిలీజ్ డేట్ చెప్తాడు. అదే డిసెంబరు 13.
వెంకటేశ్ జన్మదిన కానుకగా ఈ నెల 13న 'వెంకీమామ'.. ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్.. నాగచైతన్య పక్కన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నాగచైతన్య సైనికుడి పాత్రలో, వెంకటేశ్ రైతుగా కనిపిస్తారు.
ఇది చదవండి: అమ్మయినా.. నాన్నయినా.. నువ్వేలే 'వెంకీమామ'