తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డమే క‌ష్ట‌మైంది' - venky mama trailer

'వెంకీమామ' విడుదల నేపథ్యంలో చిత్రవిశేషాలను పంచుకున్నారు నిర్మాత సురేశ్​బాబు. ప్రస్తుతం టాలీవుడ్​లో ఉన్న కథల పరిస్థితి గురించి వివరించారు. తన దగ్గరున్న కథలకు దర్శకులను వెతకడం కష్టమైందని అన్నారు.

'ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డమే క‌ష్ట‌మైంది'
నిర్మాత సురేశ్​బాబు-వెంకీమామ సినిమా

By

Published : Dec 9, 2019, 10:39 PM IST

తెలుగు చిత్రసీమలో కథల కొరత ఉందని ఎవరైనా అంటే నిర్మాత సురేశ్​బాబుకు నచ్చదేమో. ఎందుకంటే ఆయన దగ్గర బోలెడు కథలున్నాయి. కానీ వాటికి దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమవుతుందని అన్నారు. సొంత వాటినే కాకుండా పొరుగు భాషల్లోని కథలను రీమేక్ చేస్తుంటారు. అలా ఆయన దగ్గర ఇప్పటికే చాలా కథలు పోగయ్యాయి. సురేశ్​బాబు ప్రస్తుతం నిర్మించిన 'వెంకీమామ' ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే.

వెంకీమామ నిర్మాతలు వివేక్ కూచిభొట్ల-సురేశ్​బాబు

విడుదల తేదీలో గందరగోళం అందుకే

నా కెరీర్‌లో తొలిసారి విడుద‌ల విష‌యంలో గంద‌ర‌గోళానికి గుర‌య్యా. చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌ర్వాత 'వెంకీమామ‌'ను ఈ నెల 13న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించాం. మొద‌ట ద‌స‌రాకే తీసుకురావాలనుకున్నాం. కానీ నా జీవితంలో గ‌తేడాది చాలా సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అందుకే రెండు నెల‌ల‌పాటు అమెరికాలోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయినా ద‌స‌రాకే తెద్దామని ప్ర‌య‌త్నించాం కానీ, వెంక‌టేశ్ కాలికి గాయ‌మైంది. ఆ త‌ర్వాత దీపావ‌ళికి అనుకున్నాం. రాశీఖ‌న్నా డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డం వల్ల మిగిలిన ఒక్క పాట‌ను షూట్ చేయలేకపోయాం. అలా దీపావ‌ళికి కూడా రాలేక‌పోయాం. ఈ కారణంతో సంక్రాంతికి విడుద‌ల అనే పుకారొచ్చింది. అయితే మేం ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికే మూడు సినిమాల రిలీజ్​ డేట్స్ ఖ‌రార‌య్యాయి. మేం అప్పుడు రావ‌డం భావ్యం కాదు. పైగా వెంక‌టేశ్​కు అంద‌రితో మంచి అనుబంధం ఉంది. అందుకే క్రిస్​మ‌స్ క‌లిసొస్తుంద‌ని ఈ నెల 13న విడుద‌ల తేదీగా నిర్ణయించాం. మ‌హిళ‌ల‌కు న‌చ్చే అంశాలున్నాయి కాబ‌ట్టి, నా థియేట‌ర్ల‌లో సంక్రాంతి వ‌ర‌కూ ఈ సినిమా ఆడుతుంద‌నే భ‌రోసా ఉంది

అన్ని ఉంటాయి ఈ సినిమాలో

వెంక‌టేష్ 'ఎఫ్‌2' చేయ‌డం కంటే ముందే ఈ క‌థ మా ద‌గ్గ‌ర ఉంది. జనార్ధ‌న మ‌హ‌ర్షి చెప్పిన ఈ క‌థ‌ను, వివేక్ కూచిభొట్ల మొద‌ట మా ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. క‌థ న‌చ్చింది కానీ, చాలా మెరుగులు దిద్దాలనిపించింది. అప్పుడు కోన‌ను పిలిచి ఈ క‌థ వినిపించి ఏమైనా మార్చ‌గ‌ల‌మా అని అడిగా. మార్చొచ్చు అని చెప్పి ద‌ర్శ‌కుడు బాబీని ప‌రిచ‌యం చేశాడు. బాబీతో పాటు అతడి బృందం క‌లిసి ఈ క‌థ‌ను కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో క‌లిపి స్క్రిప్టు చేశారు. ఆ సీక్వెన్స్ గురించి చెప్ప‌గానే నాకు క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. నేను ఎప్పుడైనా సినిమాను ఒక టెంప్లేట్ ప్ర‌కారం చేస్తుంటాను. ఆ ప్ర‌కారం నాకున్న సందేహాల‌న్నింటినీ బాబీ ముందు పెట్టా. వాట‌న్నిటికీ పరిష్కారం వెదుక్కుంటూ ఈ సినిమాను పూర్తి చేశాడు. భావోద్వేగాలు, విలువ‌లు, మంచి హాస్యం, కుటుంబ అంశాలు... అన్ని మేళ‌వించిన చిత్ర‌మిది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను చూశాక మ‌నం కూడా ఇలా ఉండాలి, ఇలాంటి విష‌యాల్ని అనుస‌రించాల‌ని ఒక నిర్ణ‌యానికొస్తారు.

వెంకీమామ సినిమాలో వెంకటేశ్-నాగచైతన్య

అలా చేస్తే ఎక్కువగా రోజులు ఆడతాయి

ప్రేక్ష‌కుల అభిరుచులు మారాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమాను అందించాలి. కొన్ని ఊళ్ల‌లో ఒక‌ట్రెండు థియేట‌ర్లు మాత్ర‌మే ఉంటాయి. వాటిలో ప్ర‌ద‌ర్శ‌న మ‌ల్టీప్లెక్స్‌ల త‌ర‌హాలో ఉండాలి. రోజుకి మొత్తం ప‌ది షోలు ప‌డ‌తాయంటే అందులో మూడు నాలుగు సినిమాల్ని ప్ర‌ద‌ర్శించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దాంతో అన్ని ర‌కాల సినిమాలు ప్రేక్ష‌కులకు అందుబాటులోకి వ‌స్తాయి. పైగా ఒక్కొక్క‌ సినిమా ఇదివ‌ర‌క‌టిలాగా ఎక్కువ రోజులు ఆడే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే, తాను అనుకున్న సినిమా థియేట‌ర్‌లో లేదంటే ప్రేక్ష‌కుడు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటాడు. డిజిట‌ల్ మాధ్య‌మాలు, పైర‌సీల్ని ఆశ్ర‌యిస్తాడు. అందుకే మ‌నం సినిమాను ప్రేక్ష‌కుల ముందు స‌మ‌ర్థ‌మంతంగా తీసుకెళ్లాలి.

వెంకీమామ సినిమాలో నాగచైతన్య-రాశీఖన్నా

దర్శకుల్ని ఎంపిక చేయడం కష్టంగా ఉంది

క‌థ‌లు చాలా ముఖ్యం. బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోలంటే ఖాన్ త్ర‌య‌మే. కానీ ఇప్పుడ‌క్క‌డ ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌ కుమార్ రావు వంటి హీరోల సినిమాలు కూడా వంద‌ల కోట్లు వ‌సూళ్లు చేస్తున్నాయి. అక్ష‌య్‌కుమార్ అన్ని ర‌కాల క‌థ‌లు చేస్తున్నాడు. వాళ్ల శైలిలో క‌థా బ‌ల‌మున్న చిత్రాలు చేయాలి. అప్పుడు అన్ని సినిమాల్ని, అంద‌రి సినిమాల్నీ చూడ‌టానికి ప్రేక్ష‌కుడు ఆస‌క్తి చూపుతాడు. తెలుగులోనూ హీరోలు అలా మారే స‌మ‌యం ద‌గ్గ‌ర్లోనే ఉంది. డిజిట‌ల్ మాధ్య‌మాల వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచ‌న లేదు. నా ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌ల‌కు ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డ‌మే ఇప్పుడు క‌ష్టంగా మారింది.

అందుకోసమే శ్రమిస్తున్నాం

హాలీవుడ్‌లో ఒకొక్క క‌థ కోసం రెండు మూడేళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ చాలా ముఖ్యం. ఇక్క‌డ క‌థ‌లు బాగానే ఉంటాయి. కానీ ఇంకొంచెం బాగుంటే బాగుంటుందని.. మ‌రిన్ని మెరుగులు దిద్ద‌మ‌ని చెబుతుంటాం. సినిమా తీసే విధానం ఉత్త‌మంగా ఉండాలి. అప్పుడు అనుకున్న ఫ‌లితాలొస్తాయి. 'హిర‌ణ్య‌' కోసం మూడేళ్లుగా మా బృందం క‌ష్ట‌ప‌డుతోంది. అత్యుత్త‌మ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమా తీయాల‌నేదే మా క‌స‌రత్తంతా. అందుకోస‌మే శ్ర‌మిస్తున్నాం. వెంక‌టేశ్​ కోసం త‌రుణ్ భాస్క‌ర్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడు. త్రినాథ‌రావు న‌క్కిన.. ఇంత‌కుముందు అనుకున్న క‌థ కాకుండా, మ‌రొక‌టి సిద్ధం చేస్తున్నాడు.

దాసరి తరహాలో నాయకుడు కావాలి

ఎప్ప‌ట్నుంచో సినిమాలు తీస్తున్నాం కానీ, మ‌న విధానం మాత్రం ఇంకా మార‌లేదు. బాలీవుడ్ యాభై శాతం మారింది. అక్క‌డ కొన్ని సంస్థ‌లు ప్ర‌ణాళిక బ‌ద్ధంగా సినిమాను తీస్తున్నాయి. ఇక్క‌డ నిర్మాత‌లకు త‌ప్పులు క‌నిపిస్తున్నా, వాటిని అలానే చేయ‌నిస్తున్నారు. దాంతో అన్ని విభాగాల్లోనూ ఎఫిషియ‌న్సీ లోపించింది. దానివ‌ల్లే స‌మ‌స్య‌లు. అంద‌రూ స‌మ‌ర్థ‌త‌తో ప‌నిచేస్తే ప‌రిశ్ర‌మ క‌చ్చితంగా మంచి దారిలో ప‌య‌నిస్తుంది. దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర‌హాలో మ‌న ప‌రిశ్ర‌మ‌కి ఒక నాయ‌కుడు అవ‌స‌రం నిజంగానే ఉంది. నాలాంటివాళ్లు ఆ బాధ్య‌త‌ను తీసుకుంటే స్వార్థం కోణాల్ని వెదుకుతారేమో అనిపిస్తుంటుంది.

ABOUT THE AUTHOR

...view details