తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తొలి చిత్రం కోసం ఎంత కష్టపడ్డానో... 'భీష్మ'కు అంతే' - venky kudumula special interview about bheesma movie

నితిన్, రష్మిిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భీష్మ'. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. వాటిపై ఓ లుక్కేద్దాం.

bheesma_
ఛలో ఫేమ్​ దర్శకుడు వెంకీ కుడుముల

By

Published : Feb 21, 2020, 9:25 AM IST

Updated : Mar 2, 2020, 1:05 AM IST

"నేను ప్రతి చిత్రాన్ని పరీక్షలాగే ఫీలవుతా. తొలి చిత్రం కోసం ఎంతైతే కష్టపడ్డానో.. ఈ సినిమాకూ అంతే కష్టపడ్డా. రేపు మరో సినిమా చేసినా ఇలాగే నిజాయితీగా పనిచేస్తా" అంటున్నాడు వెంకీ కుడుముల. 'ఛలో' వంటి హిట్‌తో తొలి అడుగులోనే తెలుగు సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడతడు. ఇప్పుడు రెండో చిత్రంగా 'భీష్మ'తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు వెంకీ కుడుముల.

‘భీష్మ’ అనుకున్న దానికన్నా ఆలస్యమైనట్లుంది. కారణం ఏంటి?

నేనెప్పుడూ స్క్రిప్ట్‌ పక్కాగా పూర్తయ్యాకే సెట్స్‌పైకి వెళ్లడానికి ఇష్టపడతా. అప్పుడు మేకింగ్‌ విషయంలో మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ, ఈ చిత్రం అనుకున్నాక కొన్ని వ్యక్తిగత.. ఇతర కారణాల వల్ల స్క్రిప్ట్‌ పరంగా కాస్త ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో నాకు నితిన్‌ అండగా నిలిచారు. "నువ్వు ఆలస్యమవుతోందని ఏం తొందర పడకు.. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యాకే చిత్రీకరణకు వెళ్దాం" అని మాటిచ్చారు. ఆయనిచ్చిన ఈ మాట కోసం దాదాపు ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను.

ఛలో ఫేమ్​ దర్శకుడు వెంకీ కుడుముల

నితిన్‌ను ఈ కథలోకి ఎలా తీసుకొచ్చారు?

ఛలో తర్వాత నితిన్‌తో సినిమా చేద్దామనుకున్నా.. ఆయన చేద్దామన్నారు. అప్పుటికి నా దగ్గర ఓ రెండు లైన్ల కథ ఉంది. కానీ, ఆయన క్యారెక్టర్‌కు సరిపోయేలా ఓ కొత్త కథ రాద్దామని నిర్ణయించుకున్నా. ఆయనకెలాగూ పెళ్లి కాలేదు. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అంటుంటే ఆ తరహాలోనే కథ రాస్తే బాగుంటుంది కదా అనిపించి ఈ 'భీష్మ' స్క్రిప్ట్‌ను సిద్ధం చేశా.

మరి 'భీష్మ' కథలోకి ఆర్గానిక్‌ వ్యవసాయం ఎలా వచ్చింది?

నేను అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయెట్‌ని కావడం వల్ల వ్యవసాయ రంగంపై ముందు నుంచి మంచి ఆసక్తి ఉంది. రెండేళ్ల క్రితం ఓ వీడియో చూశా. ఆ వీడియోల్లో పుచ్చకాయలకు ఇంజెక్షన్లు వేయడం.. పండ్లకు ఏవేవో వ్యాక్సిన్లు చెయ్యడం చూశా. ఇది ప్రతిఒక్కరికీ హాని కలిగించే విషయం. రైతులకు సరైన అవగాహన లేక త్వరగా పంట చేతికి రావాలనే ఉద్దేశంతో ఏవేవో కృత్రిమ ఎరువులు వాడేస్తున్నారు. వీటి వల్లే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మన జీవన ప్రమాణం చాలా పడిపోయింది. తరచూ అనారోగ్యాలకు గురవుతున్నాం. కాబట్టి ఇలాంటి అంశాన్ని సినిమా ద్వారా చూపిస్తే బాగుంటుందని ఆ పాయింట్‌ను ఈ కథలోకి తీసుకున్నా. నిజానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్‌. కానీ, ఈ చిత్రంతో ప్రజల్లో.. రైతుల్లో ఓ చిన్న అవగాహన కలిగించే ప్రయత్నం చేశా.

ప్రేమకథలో.. ఆర్గానిక్‌ వ్యవసాయం వర్కవుటవుతుందా? అన్న భయం కలగలేదా?

లేదు. ఎలాంటి జోనర్‌ తీసుకున్నా.. అందులో ప్రేమన్నది కచ్చితంగా ఉంటుంది. ఇది ఆర్గానిక్‌ వ్యవసాయానికి సంబంధించిన సబ్జెక్ట్‌ అయినప్పటికీ దాన్నేదో సీరియస్‌ కోణంలో చూపించే ప్రయత్నం చేయలేదు. వినోదాత్మకంగా సందేశమిచ్చే ప్రయత్నం చేశా. దీనిలో భాగంగానే చిన్న లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. ఇందులో రష్మిక ఆర్గానిక్‌ ఫాం కంపెనీలో పనిచేస్తుంటుంది. నితిన్‌కు మాత్రం ఈ కంపెనీతో సంబంధం ఉండదు. కానీ, చివరకు అతను ఆ కంపెనీ వ్యవహారంలోకి వస్తాడు. అది ఎలా జరిగింది? ఆయనకీ ఈ ఆర్గానిక్‌ ఫాంకు సంబంధం ఏంటనేది? మిగిలిన చిత్ర కథ.

ఛలో ఫేమ్​ దర్శకుడు వెంకీ కుడుముల

ఇంతకీ టైటిల్‌ వెనుక కథేంటి?

నిజానికి ఇందులో ఇద్దరు 'భీష్మ'లు ఉంటారు. పురణాల్లోని భీష్ముడి తరహా పాత్ర అనంత్‌ నాగ్‌ది. నితిన్‌ మాత్రం అమ్మాయిలు కావాలనుకున్నా.. భీష్మ అన్న పేరు వల్ల బ్రహ్మచారిగా మిగిలిపోయాననుకోని ఫీలయ్యే పాత్ర అతనిది. అందుకే వీళ్ల క్యారెక్టరైజేషన్స్‌ ఆధారంగానే చిత్ర టైటిల్‌ను 'భీష్మ'గా పెట్టాం.

రష్మికనే కథానాయికగా తీసుకోవడానికి కారణమేంటి?

రష్మికతో తొలిసారి చేసినప్పుడే ఆమె పని తీరు నాకు బాగా నచ్చింది. ఆమె 'ఛలో' కోసం మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు తనకి తెలుగు అన్న పదం తప్ప మరొకటిరాదు. అలాంటిది సినిమా పూర్తయ్యే నాటికి తెలుగు పూర్తిగా నేర్చుకొని.. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పింది. ఆ ప్రతిభ నచ్చి అప్పుడే అనుకున్నా.. తనతో మళ్లీ చెయ్యాలని. ఈ పాత్ర రాసుకున్నప్పుడు తనని ఊహించే రాసుకున్నా. కానీ, నా తొలి చిత్రానికి ఈ సినిమాకు మధ్య వచ్చిన గ్యాప్‌లో ఆమె పెద్ద స్టార్‌ అయిపోయింది. దీంతో ఈ పాత్రకు ఓకే చెప్తుందా? లేదా? అనుకున్నా. కానీ, కథ గురించి చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా నేను చేస్తా అంది.

మీ సినిమాల్లోని సంభాషణల్లో త్రివిక్రమ్‌ శైలి బాగా కనిపిస్తుంటుంది. ఎందుకలా?

నేను త్రివిక్రమ్‌ దగ్గర పనిచేసి రావడం వల్ల ఆయన ప్రభావం నాపై ఉంది. అందుకే నా సినిమాల్లోని సంభాషణల్లో ఆయన శైలి కనిపిస్తుంది. నా దృష్టిలో తెలుగులోని బెస్ట్‌ రైటర్‌ ఆయనే. ఆయన అన్ని రకాల సంభాషణలు రాసేశారు.. కాబట్టి ఎవరే డైలాగ్‌ రాసినా త్రివిక్రమ్‌ గుర్తుకు రావడం సహజమే.

'భీష్మ'ను ఆయనకు చూపించారా? ఏమైనా సలహాలు, సూచనలిచ్చారా?

ఆయన సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసించారు. ట్రైలర్‌లోనే కథ చెప్పు.. ప్రేక్షకులు దానికి తగ్గట్లుగా ప్రిపేర్‌ అయ్యి వస్తారు అని త్రివిక్రమ్‌ గారే సలహా ఇచ్చారు. అందుకే ట్రైలర్‌లోనే కథ చెప్పా.

నాగøశౌర్య అమ్మగారు మీకు కారు బహుమతిగా ఇచ్చారు. దాన్ని అమ్మేశారట కదా? ఏంటా వివాదం?

నిజానికి ఈ అంశం మాట్లాడకూడదు అనుకున్నా. కానీ, మీరడిగారు కాబట్టి చెబుతున్నా. నా తొలి చిత్రానికి వచ్చిన మొదటి కానుక అది. దాన్ని నేనెలా అమ్ముతా. అయినా మా వ్యక్తిగత విషయాలపై జనాలకు అంత ఆసక్తి ఉండదని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేద్దాం.

తర్వాతి సినిమాలు ఎవరితో?

ప్రస్తుతానికి నా దృష్టంతా ఈ చిత్రంపైనే ఉంది. దీని తర్వాత కొత్త కథలు రాసుకోవాలి. మైత్రీ మూవీస్, యువీ క్రియేషన్స్‌ వారితో పని చెయ్యాల్సి ఉంది. వీటిలో ముందేది అన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు.

నితిన్‌ - రష్మిక జంటగా నటించిన చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించాడు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇదీ చూడండి :థియేటర్లలో 'పాంచ్ పటాకా'.. ఏకంగా ఐదు సినిమాలు

Last Updated : Mar 2, 2020, 1:05 AM IST

ABOUT THE AUTHOR

...view details