తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానా నాకే పోటీగా మారాడు: వెంకటేశ్‌ - రానా అరణ్య

'అరణ్య' ప్రిరిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో వెంకటేశ్.. ఈ చిత్రం ప్రేక్షకులు గర్వపడేలా తీశారని అన్నారు. రానా నటనలో ఎంతో ఒదిగిపోయాడని చెప్పిన ఆయన.. రానా తనకు పోటీగా మారాడని అన్నారు.

rana
రానా

By

Published : Mar 21, 2021, 6:47 PM IST

థియేటర్లో చూసిన తర్వాత ప్రేక్షకులు ఎంతో గర్వపడేలా చేసే సినిమా 'అరణ్య' అని అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ అన్నారు. ఈ సినిమాలో రానా నటన చూస్తే ఎంతో ఎదిగిపోయాడని అనిపిస్తోందన్నారు. రానా హీరోగా ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అరణ్య చిత్రబృందంతో రానా

ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ.. "ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. ముందుగా ప్రకృతి గురించి మాట్లాడాలి. ప్రకృతికి కోపం వస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ప్రకృతితో ముడిపడి ఉన్న అడవి కథతో ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్‌ ప్రభుసాల్మన్‌కు కృతజ్ఞతలు. మనందరం ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా మన దేశంలో వచ్చినందుకు అందరం గర్వపడతాం.. రానా గురించి చెప్పాలంటే.. మావాడు అని కాదు.. అతని నటన నమ్మశక్యంగా లేదు. రానా ఎంతో ఎదిగిపోయాడు. నాకే పోటీగా మారాడు. ఇలాంటి సినిమా రానాకు ఇచ్చినందుకు ప్రభు సాల్మన్‌కు ధన్యవాదాలు. అడవుల్లో షూటింగ్‌ అంటే చాలా కష్టం. అరణ్య కోసం సినిమా బృందం ఎంతో కష్టపడింది. సినిమాలో ఏనుగుల హావభావాలను ఎంతో బాగా చూపించారు. అది అంత సులభం కాదు. ప్రేక్షకులు కుటుంబంతో పాటు ఈ సినిమాను ఆస్వాదించాలి' అని అన్నారు.

రానా

అంతకు ముందు రానా మాట్లాడుతూ.. "అడవి మధ్యలో.. ఏనుగులకు దగ్గరగా ఉన్నాను. నా అనుభవాన్ని మీకు మాటల్లో చెప్పలేను. అది మీకు అర్థం కావాలంటే.. మీరు 26న థియేటర్లో సినిమా చూస్తేనే తెలుస్తుంది. మామూలుగా మనం.. ఒక రెండ్రోజులు అడవిలో ఉంటే.. మనశ్శాంతిగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. అలాంటిది నేను ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు అడవిలో ఉన్నాను. ఈ సినిమాతో 'నేను ఎందుకు..?' అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఈ సినిమా డైరెక్టర్‌ ప్రభు సాల్మన్‌ గురించి చెప్పాలంటే.. నాకు ఎంతో నేర్పించిన వ్యక్తి ఆయన" అని రానా అన్నారు.

డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. "రానాతో కలిసి తీసిన 'లీడర్‌' వచ్చి పదేళ్లు పూర్తయింది. ముఖం చూసి రానాను ఈ సినిమాలో ప్రభుసాల్మన్‌ తీసుకున్నారట. అలాగే.. లీడర్‌లో కూడా రానా గొంతు విని నేను సినిమాలో తీసుకున్నాను. ఈ సినిమా చూస్తుంటే.. అంతర్జాతీయ ప్రమాణాలతో తీశారని అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగే సినిమా ఇది" అని ఆయన అన్నారు.

ఇదీ చూడండి: చిరు చేతుల మీదుగా 'విరాట పర్వం' టీజర్​.. ఎప్పుడంటే

ABOUT THE AUTHOR

...view details