తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్టీఆర్, నానితో సినిమా చేయాలనుంది: వెంకటేశ్

సీనియర్ హీరో వెంకటేశ్​.. మరో మల్టీస్టారర్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'వెంకీమామ' అంటూ నవ్వించబోతున్నాడు. పుట్టినరోజు నాడే సినిమా వస్తుండటం మరో విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మనసులో విషయాల్ని పంచుకున్నాడు.

VENKY MAMA
సీనియర్ హీరో వెంకటేశ్

By

Published : Dec 13, 2019, 7:53 AM IST

మల్టీస్టారర్‌ కథలు రాసుకుంటే ఓ పాత్ర వెంకటేశ్ కోసం అట్టిపెట్టుకోవాల్సిందే. హీరో నవ్విస్తాడనుకుంటే.. వెంకీని దృష్టిలో ఉంచుకోవాల్సిందే. సెంటిమెంట్‌ పిండేయాలంటే... అక్కడ కూడా విక్టరీని తీసుకురావాల్సిందే. పాత్ర ఏదైనా 'సింగిల్‌ హ్యాండ్‌'తో నడిపించగల సమర్థుడు వెంకీ. ఆ టైమింగ్‌ మరెవ్వరికీ రాదేమో? ఈ ఏడాది ప్రారంభంలో 'ఎఫ్‌ 2'తో వినోదాలు పంచాడు. చివర్లో 'వెంకీ మామ'తో సందడి చేయనున్నారు. శుక్రవారం వెంకటేశ్ పుట్టిన రోజు. 'వెంకీ మామ' విడుదల రోజు ఈ రోజే కావడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో చిత్రవిశేషాలను పంచుకున్నాడు.

33 సంవత్సరాల మీ సినీ జీవితంలో మీ పుట్టిన రోజున విడుదలవుతున్న మీ తొలి సినిమా ఇదే కదా?

అవును. నేనైతే ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోను. పుట్టిన రోజు వస్తోందంటే ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతాను. ఈసారీ ఎందుకైనా మంచిదని టికెట్లు తీసి పెట్టుకున్నాను.. (నవ్వుతూ).

'వెంకీ మామ' ప్రచార పర్వంలో హడావుడి అంతా మీదే కనిపిస్తోంది. కారణం.. మీ మేనల్లుడి సినిమా అనా..?

కావొచ్చు. వాడి ఉత్సాహం అంతా నాకొచ్చేసినట్టుంది. స్టేజీ ఎక్కగానే ఏదో చేసేస్తాను. ఇంటికెళ్లాక 'ఇదంతా చేసింది నేనేనా' అనిపిస్తుంది. చాలా ప్రేమించి చేసిన సినిమా ఇది. పైగా నేనూ, చైతూ కలసి ఓ సినిమా చేయాలన్నది నాన్నగారి కోరిక. ఆ ఆనందం ఇలా బయటకు వచ్చేస్తోందేమో..?

హీరో వెంకటేశ్

చైతూ పాత్ర బాగుండాలని ముందు నుంచీ గట్టిగా చెబుతూ వచ్చారట. మేనల్లుడికి ఓ విజయం అందివ్వాలని గట్టిగా అనుకున్నారా?

సినిమాలో అన్ని భావోద్వేగాలూ బలంగా ఉండాలనుకున్నాం. దాని వల్ల చైతూ పాత్ర బాగుండడమే కాకుండా, సినిమా బాగా వస్తుంది. హిట్లూ, ఫ్లాపులూ అందరికీ ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. చైతూ అదే చేస్తున్నాడు.

చైతూను దగ్గర్నుంచి గమనించారు కదా? మేనమామ పోలికలు ఏమైనా వచ్చాయా?

చెప్పిన సమయానికి సెట్లో ఉంటాను. తనూ అంతే. అయితే అక్కడికొచ్చాక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. వాడిని చూడగానే 'వీడూ మన లైన్‌లోనే ఉన్నాడన్నమాట' అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ వాడితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అప్పట్లో చాలా ముద్దుగా ఉండేవాడు. వాడిని ఎత్తుకోవడానికి మేమంతా పోటీపడేవాళ్లం. మా ఇంట్లో ఎవ్వరం 'సినిమాల్లోకి రావాలి' అని ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. నేనూ, రానా, చైతూ.. ముగ్గురం అనుకోకుండానే వచ్చాం. ప్రేక్షకులు ఆశీర్వదించడం మా అదృష్టం.

మల్టీస్టారర్‌ చిత్రాలకు ఇప్పుడు మీరే పెద్ద దిక్కు అయ్యారు

అంత లేదమ్మా.. ఒకట్రెండు సినిమాలు సరిగా ఆడకపోతే 'వీడికి ఎక్కువైంది... ఎందుకు మల్టీస్టారర్లు. సోలో హీరోగా చేసుకోకుండా' అని అంటారు. ఆ సంగతి నాకు తెలుసు.

హీరో వెంకటేశ్

మరో హీరోతో సినిమా చేస్తున్నప్పుడు స్క్రీన్‌ టైమ్‌ గురించి పట్టించుకుంటారా?

అలా అనుకుంటే ఆ సినిమాలు చేయలేం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గోపాల గోపాల', 'ఎఫ్‌ 2'.. ఇవన్నీ చేస్తున్నప్పుడు 'నా పాత్రేమిటి? నేనేం చేయాలి' అనే ఆలోచించాను. ఈతరం హీరోలు ఎన్టీఆర్‌, నాని.. వీళ్లతో సినిమాలు చేయాలనుంది.

'అసురన్‌' రీమేక్‌ చేస్తున్నారు కదా. ఆ కథలో ఏం నచ్చింది?

ఎమోషన్‌ బాగుంది. చూడగానే 'ఇది మనం చేయాల్సిందే' అనుకున్నాను. అరగంటలో హక్కులు తీసుకున్నాం. ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీకాంత్‌ అడ్డాలను ఎంచుకున్నాం. తను చాలా కసితో సినిమా చేస్తున్నాడు.

రిటైర్‌మెంట్‌ ఆలోచనలు ఉన్నాయా?

ఎప్పుడో రిటైర్‌ అయిపోదాం అనుకున్నా. కానీ అవ్వనివ్వడం లేదు. 'ఫర్లేదు.. కొన్ని సినిమాలు చేయగలవు' అనుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details