Venkatesh New Movie: కథానాయకుడు వెంకటేష్ మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారా? ఓ యువ దర్శకుడితో కలిసి పని చేయనున్నారా? అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. వెంకటేష్ ప్రస్తుతం 'ఎఫ్3' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రానాతో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఇప్పుడాయన 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. వినోదాత్మక కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దీన్ని నిర్మించనున్నారని ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. అనుదీప్ ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ ద్విభాషా చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంకటేష్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
లక్ష్యం2తో వస్తున్న గోపీచంద్
Gopichand New Movie:గోపీచంద్ కథా నాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డింపుల్ హయాతి కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం మిళితమైన బలమైన కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమా కోసం 'లక్ష్యం2' అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ నటిస్తున్న 30వ చిత్రమిది. ఈనెల 21నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం: వెట్రి పళని స్వామి.