అగ్రకథానాయకుడు వెంకటేశ్(Venkatesh) తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 'నారప్ప'(Narappa) విషయంలో అభిమానులందరూ తన నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'నారప్ప' మరో మూడు రోజుల్లో అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ చిత్రం 'అసురన్'(Asuran) రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం
సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయమని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు కదా?మరి, మీరు సడన్‌గా ఓటీటీ బాట పట్టారు? కారణమేమిటి?
సడన్ అనేది ఏం లేదు. నా దృష్టిలో సడన్ అంటే కాలానికి కట్టుబడి ఉండడం. నా స్వభావం అది కాదు. జీవితంలో ఎప్పుడైనా సరే.. 'ఎందుకు' అని ప్రశ్నించకూడదు. జీవన ప్రయాణంలో అలా సాగిపోవాలి. ఈ విషయాన్నే నేను ఎప్పుడూ ఫాలో అవుతుంటా. ఒక నటుడిగా నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తా. విడుదల ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఇలా వేరేవాళ్ల విషయాల్లో నేను పెద్దగా ఆసక్తి చూపించను. అదే నా సహజ స్వభావం.
మీ కెరీర్‌లో ఓటీటీ బాటపట్టిన మొదటి సినిమా ఇదే కదా?
ఎవరి జీవితంలోనైనా ఏదో ఒక విషయంలో కొత్తగా చేస్తే అది ఫస్ట్ టైమ్ అవుతుంది. అలాగే ఇది నాకు ఫస్ట్ టైమ్.
'నారప్ప'ను ఓటీటీలో విడుదల చేయడం పట్ల మీ అభిమానులు కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు?
నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికీ అభిమానులందరూ నాతోనే ఉన్నారు. నాపై అభిమానాన్ని, ప్రేమను చూపిస్తున్నారు. దానికి నేను కృతజ్ఞుడిని. 'నారప్ప' విడుదల విషయంలో నా అభిమానులు కొంతమంది అసహనంగా ఉన్నారని తెలిసింది. కానీ, పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదల చేయక తప్పడం లేదు. అభిమానుల్ని బాధపెట్టినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. పరిస్థితులు చక్కబడిన తర్వాత నా తదుపరి చిత్రాలను థియేటర్లలోనే చూడవచ్చు. వాళ్లు నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా.
'అసురన్'లో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?
'అసురన్' లాంటి ఓ క్లాసిక్ చిత్రాన్ని అందించిన వెట్రిమారన్, ధనుష్‌లకు కంగ్రాట్స్. 'అసురన్' ఓ అద్భుతమైన కథ. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను అలాంటి చిత్రాన్ని చూడలేదు. చూడగానే నాకు బాగా నచ్చిన చిత్రమిది. తప్పకుండా ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. ప్రేక్షకులకు మంచి సినిమాలు దగ్గర చేయాలనే ఉద్దేశంతో 'చంటి', 'సుందరకాండ', 'గురు' చిత్రాలు తెలుగులోకి రీమేక్ చేశా. "మీరు ఎందుకని ఎక్కువగా రీమేక్‌లు చేస్తుంటారు?" కొంతమంది అంటుంటారు. ఒక్కటి మాత్రం చెప్పగలను.. రీమేక్‌లో నటించడం అంత సులభమైన పని కాదు. నా వరకూ అది ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయం. 'ఎఫ్-2' తర్వాత ఇలాంటి కథలో నటించడం చాలా కొత్తగా ఉంది.
ఒక నటుడిగా 'నారప్ప' మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
కెరీర్ పరంగా చెప్పాలంటే ఇది ఎంతో ఛాలెంజింగ్ క్యారెక్టర్. లుక్, ఎమోషనల్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా సవాళ్లతో కూడుకున్నవే. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో 50రోజులపాటు అదే డ్రెస్‌లో హోటల్ రూమ్‌లో ఉన్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆశీస్సులతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత స్ట్రాంగ్ క్యారెక్టర్ పోషించే అవకాశం నాకు వచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
శ్రీకాంత్ అడ్డాలతో కలిసి నేను 'సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు' చేశాను. ఒకానొక సమయంలో ఆయన 'అసురన్' చిత్రాన్ని వీక్షించారు. ఆయనకీ సినిమా బాగా నచ్చింది. రీమేక్ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి కనబరిచారు. అలా, ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు. నిజం చెప్పాలంటే 'నారప్ప' తెరకెక్కించడం శ్రీకాంత్‌కు ఓ ఛాలెంజ్. ఆయన ఎంతో చక్కగా సినిమాని తీర్చిదిద్దారు. ఒక సినిమా విడుదలై అది ఒక బెంచ్‌మార్క్ క్రియేట్ చేసినప్పుడు అసలైన కథకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రీమేక్ చేయాలి.
ట్రైలర్‌కు ఎలాంటి స్పందన వచ్చింది? దానిపై మీ అభిప్రాయం ఏమిటి?
'నారప్ప' ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ బాగుందని ఎంతోమంది చెప్పారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. ఒక రీమేక్‌ని.. మాతృకతో పోల్చి చూడటమనేది మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. 'సుందరకాండ', 'చంటి' సమయాల్లోనూ అది జరిగింది. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేమంతా ఎవరి బాధ్యతలు వాళ్లు చక్కగా నిర్వర్తించాం. సినిమా కూడా చక్కగా సిద్ధమైంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి భావోద్వేగాలతో ఉన్న కథలు రాలేదు.. అలాగే నేను చేయలేదు.. ఇందులోని ప్రతి ఎమోషన్‌కి అందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు.. ఇలాంటి ఎన్నో అంశాల వల్ల ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.
'నారప్ప'లో మీరు వృద్ధుడు, యువకుడు రెండు వేరియేషన్స్‌లో కనిపించారు. కానీ, ఫ్లాష్‌బ్యాక్‌లో యువకుడిగా రానా కనిపించే అవకాశాలున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి?
రానా ఎలా నటిస్తాడమ్మా.. వాళ్లు ఎవరో అనుకున్నారని.. మీరు ఎలా నన్ను అడుగుతున్నారమ్మా.. వాట్ అమ్మా (అని వెంకీ సరదాగా అనడం వల్ల అందరూ నవ్వులు పూయించారు).
మీరు రీమేక్‌ల్లో నటించడానికి కారణమేమిటి?
రీమేక్‌ల్లో నటించడానికి కచ్చితమైన కారణమంటూ ఏమీ లేదు. సినిమా నాకు బాగా నచ్చి ఉండొచ్చు. అలాగే అలాంటి పాత్రల్లో నటించే అవకాశం అంతకు ముందు నాకు రాకపోవడం.. ప్రేక్షకులకు మంచి కథ అందించాలనిపించడం.. నిర్మాతలపై కూడా ఎక్కువ ఆర్థికభారం లేకుండా చూసుకోవడం.. ఇలా ఎన్నో అంశాలు రీమేక్‌ల్లో నటించడానికి దోహదం చేస్తాయి.
శరీరాకృతి పరంగా చూసుకుంటే 'అసురన్' పాత్రకు ధనుష్ చక్కగా సరిపోయాడు. మరి, ఆ పాత్ర కోసం మీరేలా సిద్ధమయ్యారు?
'నారప్ప' నాకు ఓ రకంగా ఫుల్ ఛాలెంజింగ్ సినిమా. ఎందుకంటే శరీరాకృతి విషయంలో నేను ఎన్నో జాగ్రత్తలు పాటించాను. ఏ సినిమా రీమేక్‌కైనా.. ఒకటే చూడాలి.. అదేంటంటే అందులో ఎవరు నటిస్తున్నారు అని కాదు.. ఆ పాత్రకు ఎంతవరకూ న్యాయం చేయగలిగాడు. భావోద్వేగాలను సమపాళ్లలో పండించగలిగాడా? లేదా? అని. దానిని దృష్టిలో ఉంచుకునే మేము మా బెస్ట్ ఇచ్చాం. రిజల్ట్ ఏమిటనేది చూడాలి. ఇక, ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఒక విలక్షణ నటుడని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు.
'నారప్ప', 'దృశ్యం-2', 'ఎఫ్-3' ఇలా వెంటవెంటనే మూడు విభిన్నమైన జానర్ చిత్రాల్లో నటిస్తుండటం ఎలా ఉంది?