మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా 'ఆచార్య'. కాజల్ కథానాయిక. రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 29 సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు.
టీజర్ విషయంలో మంగళవారం సాయంత్రం చిరు-కొరటాల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఫన్నీ మీమ్ అందరినీ ఆకట్టుకుంది. అన్నమాట ప్రకారం టీజర్ విడుదల తేదీని ప్రకటించిన కొరటాలకు చిరు బుధవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ కూడా ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేశారు.
"చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా టీజర్‌కి.. బయట టాక్.." అంటూ చిరంజీవి, రామ్‌చరణ్‌లను ట్యాగ్ చేస్తూ బ్రహ్మానందం ఇమేజ్‌తో చేసిన మీమ్‌ను పంచుకున్నారు. ఇదిగో అదే మీమ్. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా నవ్వులు పూయిస్తోంది. వరుణ్ సరదాగా ఈ మీమ్ షేర్ చేశారా? లేక నిజంగా రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ చెప్పారా? తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే!
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదీ చూడండి:'మాస్టర్' వీడియో సాంగ్.. 'జాంబీరెడ్డి' థీమ్సాంగ్