ఏ భాషలోనైనా సరే బయోపిక్ చిత్రాలకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. తమ నటనను సైతం చూపించే ఆస్కారం ఉంటుందని పరితపించి మరీ నటిస్తుంటారు సినీ తారలు. ఇప్పటికే బాలీవుడ్‌లో నటుడు సంజయ్‌దత్ జీవిత ఆధారంగా వచ్చిన 'సంజూ' చిత్రంతో సత్తా చాటారు రణ్‌బీర్ కపూర్. మరోవైపు బాక్సర్ 'మేరీకోమ్' చిత్రంలో తనదైన పంచ్ విసిరింది ప్రియాంకా చోప్రా.
ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించి మెప్పించింది ముద్దుగుమ్మ పరిణితి చోప్రా. ఆ తర్వాత క్రికెటర్ కపిల్‌దేవ్ బయోపిక్ '83'తో మెప్పించేందుకు సిద్ధమయ్యారు హీరో రణ్వీర్ సింగ్. అయితే ప్రస్తుతం సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ బయోపిక్‌లో నటించే అవకాశం వరుణ్ ధావన్‌కు రాగా, డేట్స్ సర్దుబాటు కాక ఆ చిత్రం నుంచి తప్పుకొన్నట్టు ప్రకటించాడు.
తొలుత ఈ చిత్రాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కిద్దామని భావించారు నిర్మాత కరణ్‌జోహార్. అందుకోసం రైట్స్‌ను సైతం కొనుగోలు చేశారు. అయితే కరోనా కారణంగా ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఆపై నిర్మాత, యూటీవీ మోషన్ పిక్చర్స్ అధినేత రూనీ స్క్రూవాలా వాటి హక్కులు పొంది, వచ్చే ఏడాదికి అభిషేక్ చౌబే దర్శకత్వంలో చిత్రం విడుదల చేయాలని భావించారు. కథ, నేపథ్యం అంతా వరుణ్‌కు నచ్చినా, లాక్‌డౌన్ అనంతరం డేట్స్ ఇవ్వమని వరుణ్‌ని అడగ్గా, అప్పటికే చేతిలో నాలుగు చిత్రాలు తీరికలేక ధ్యాన్‌చంద్ బయోపిక్‌ను తిరస్కరించారు.
"బయోపిక్ అంటే కసరత్తు చేయాలి. దీనికి తగిన సమయం లేక చేయలేకపోతున్నా" అని వరుణ్ వివరణ ఇచ్చారు. వరుణ్ ప్రస్తుతం 'జగ్‌జగ్ జియో', 'బేదియా' లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ధ్యాన్ చంద్ చిత్రంలో ఎవరు నటిస్తారో వేచి చూడాలి మరి!
ఇదీ చూడండి..హాలీవుడ్‌కు ప్రభాస్.. వార్తల్లో నిజమెంత?