ఒకప్పుడు 'వై దిస్ కొలవెరి' అంటూ ప్రపంచం ఊగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు గంగ్నమ్ డ్యాన్స్ ఓ ఊపు ఊపేసింది. ఒక్కో సమయంలో ఒక్కో పాట, ఒక్కో డ్యాన్స్ మూవ్‌మెంట్ విశేష ఆదరణ పొందుతాయి. చిన్నా, పెద్దా, ముసలి, ముతక అన్న తేడా లేకుండా అందరినీ కట్టిపడేస్తాయి. ఇక తెలుగులో ఎప్పుడూ ఏదో ఒక పాట ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆ సమయంలో మొబైల్ ఫోన్లలో, ఎఫ్‌ఎం రేడియోల్లో, ఫంక్షన్లలో పాట మార్మోగాల్సిందే.
'నక్కిలీసు గొలుసు' ట్రెండ్.. దుర్గారావు నుంచి మైకేల్ జాక్సన్ వరకు - నక్కిలీసు గొలుసు పాట దుర్గారావు డ్యాన్స్
'పలాస' సినిమాలో 'నక్కిలీసు గొలుసు' పాట సోషల్ మీడియాలో తెగ ఊపు ఊపేస్తోంది. పలువురు సెలబ్రిటీలు ఈ పాటను మిక్స్ చేసి డ్యాన్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు ట్రెండ్ 'నక్కిలీసు గొలుసు'ది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన 'పలాస 1978'లోనిది ఈ గీతం. రఘు కుంచె స్వరాలు సమకూర్చారు. ఈ పాట ప్రస్తుతం యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇక టిక్‌టాక్(బ్యాన్ కాకముందు)స్టార్ దుర్గారావు అనేక వేరియేషన్స్‌లో డ్యాన్స్ చేసి ఈ పాటకు మరింత ప్రాచుర్యం తెచ్చారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ'లోనూ పండు ఈ పాటకు డ్యాన్స్ చేయగా, అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వీడియోగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరిన్ని రూపాల్లో ఈ సాంగ్ అలరిస్తోంది. సంగీత దర్శకుడు రఘు కుంచె కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదండోయ్ పలువురు కథానాయకులు వేరే పాటలకు వేసిన డ్యాన్స్‌ను ఈ పాటతో రీమిక్స్ చేసి, వారి అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.