'వందేమాతరం..' అంటూ ఆయన గొంతెత్తి పాడితే ఆ పదాలకు మన పాదాలు కదులుతాయి. 'నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా' అంటూ పాట అందుకుంటే అన్నాచెల్లెళ్ల అనుబంధం గుర్తొచ్చి కళ్లు చెమరుస్తాయి. 'కీరవాణి రాగంలో..' పాట వింటే మనసు ప్రేమతో పులకరిస్తుంది. 'అయ్యప్ప దేవాయ నమః' అంటూ పాట వినపడితే భక్తి పారవశ్యంతో తన్మయత్వానికి గురవుతాం. తొలినాళ్లలో విప్లవ గీతాలకు సంగీతం సమకూర్చిన ఆయన ఆ తరవాత మనసుకు హత్తుకునే ఎన్నో మెలొడీలను అందించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం... జనరంజకమైన తన పాటలతో పోటీపడే అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన ఆయనే.. వందేమాతరం శ్రీనివాస్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎవర్‌గ్రీన్ పాటల సంగీత దర్శకుడికి శుభాకాంక్షలు చెబుతూ ఆయన గురించిన ఆసక్తికర విశేషాలు..
చిన్నప్పటి నుంచే పాటలంటే మక్కువ
'వందేమాతరం' ఇంటి పేరుగా ప్రేక్షకులకు సుపరిచితులైన శ్రీనివాస్ అసలు ఇంటి పేరు కన్నెబోయిన. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. శ్రీనివాస్‌కు చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం. అప్పట్లో విడుదలైన సినిమాల్లో పాటలు వినపడితే తెలియని భావోద్వేగానికి గురయ్యే వారు. కేవలం పాటలు నేర్చుకునేందుకే సినిమాలు చూసేవారు. ఇక ఊళ్లో ఏ పండగ చేసినా, ఫంక్షన్ జరిగినా శ్రీనివాస్ పాట ఉండాల్సిందే. అడిగి మరీ తనతో పాటలు పాడించుకునే వారు. అలా చిన్నప్పుడే పాట పట్ల ఎంతో మక్కువ ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో 'భూమి కోసం', 'అల్లూరి సీతారామరాజు' చిత్రాలు విడుదలయ్యాయి. వాటిల్లోని 'ఎవరో వస్తారని..', 'తెలుగు వీర లేవరా..' పాటలంటే శ్రీనివాస్‌కు ఎంతో ఇష్టం ఏర్పడింది. 'తెలుగు వీర లేవరా..' పాట నేర్చుకునేందుకు 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని దాదాపు 10 సార్లు చూశారు.
ప్రజా నాట్యమండలిలో అడుగుపడిందలా..
శ్రీనివాస్ అన్నయ్య అంజయ్య ప్రజా నాట్యమండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1975 ప్రజా నాట్యమండలి శిక్షణ శిబిరం ఖమ్మంలో పెట్టడంతో శ్రీనివాస్ కూడా దానికి వెళ్లారు. కానీ శిబిరంలోకి అనుమతించలేదు. ఆ సమావేశాలు జరిగినన్ని రోజులూ గేటు బయట కూర్చొనేవారు. పదమూడేళ్ల అతడి మనసులో శిక్షణ శిబిరంలోకి వెళ్లాలనీ, పాటలు పాడాలనీ ఒకటే ఆరాటం. బయటికి వచ్చి వెళ్లే చాలామందిని లోపలికి పంపించండన్నా అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదు. 'అక్కడ నల్లూరి గారుంటారు, ఆయన్ని అడుగు బాబూ' అంటూ చేయి చూపించారొకరు. నల్లూరి వెంకటేశ్వర్లు ప్రజా నాట్యమండలి అధ్యక్షులు. నల్లూరన్నగా చాలామందికి చేరువైన వారు. ఒకరోజు ఆయన శ్రీనివాస్ కంటపడ్డారు. 'నన్ను లోపలికి రానివ్వండన్నా, బాగా పాడతాను' అని అడిగారు. ఆ పసి కళ్లల్లో పాడాలన్న తపన. ఆ అడగడంలో ఆత్మవిశ్వాసం. 'సరే' అన్నారాయన. 'తెలుగు వీర లేవరా... దీక్ష బూని సాగరా' పాట ఓ ప్రవాహంలా సాగింది. నల్లూరి మంత్ర ముగ్ధులయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి నటుడు నాగభూషణంతో కలిసి ప్రజానాట్యమండలిని పునరుద్ధరించి, ఎందరో కళాకారులను తయారు చేసిన నల్లూరి... శ్రీనులో ఉన్న ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు. 'శభాష్' అంటూ భుజం తట్టారు. సమావేశాలు జరుగుతున్న లోపలికి వెళ్లి గాన మాధుర్యం నిండిన ఓ చిన్నారి గొంతు బయట ఉంది. దానిని మీరూ వినాలి అని అబ్బురంగా వారందరికీ చెప్పారు.
నల్లూరితో ఒంగోలుకు..
శ్రీనివాస్ పాటలకు ముచ్చటపడిన నల్లూరన్న 'నాతో పాటు ఒంగోలు వస్తావా, ఇంకా పాటలు నేర్పిస్తా' అని అడగటం వల్ల శ్రీనివాస్ 'వస్తాను' అని చెప్పారు. 'నేను ఊరు వెళ్లాక మీ స్థానిక నాయకుడు టీవీ చౌదరికి కబురు చేస్తాను' అని వెళ్లిపోయారు. ఆ తర్వాతి రోజు నుంచి శ్రీనివాస్ ఖమ్మం సీపీఐ ఆఫీసుకు వెళ్లి 'నల్లూరి గారి నుంచి నాకేమైనా కబురొచ్చిందా' అని వెంటపడటం వల్ల అతని బాధ భరించలేక టీవీ చౌదరి.. నల్లూరి విజయవాడలో ఓ సమావేశానికి వచ్చినప్పుడు శ్రీనివాస్‌ను తీసుకెళ్లి ఆయనకు అప్పగించారు. ఏదో ఒకటి రెండు జతల బట్టలతో వచ్చిన శ్రీనివాస్‌ను నల్లూరి తన వెంట ఒంగోలు తీసుకెళ్లి తన ఇంట్లో కుమారులతో సహా పెంచి పెద్ద చేశారు. 'విద్యలేనిదే ఏ కళా రాణించదు' అని విశ్వసించే నల్లూరి మొదట శ్రీనివాస్‌కు ట్యూషన్ పెట్టి ఓ బడిలో చేర్పించి మెట్రిక్ చదివించారు. ఆపై కాలేజీలో చేర్పించారు. అదయ్యాక, నెల్లూరులో న్యాయవిద్య చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
గాయకుడిగా అడుగులు అలా..
చదువుతున్న సమయంలోనే శ్రీనివాస్ పాటల గురించి తెలిసిన సంగీత దర్శకుడు చక్రవర్తి, మాదాల రంగారావు, పోకూరి బాబూరావు, టి.కృష్ణ వంటి వాళ్లు ఆయనను మద్రాసుకు పంపమని నల్లూరిని కోరారు. వారంతా ఆయన శిష్యులు. అందరికీ 'ఇప్పుడు కాదు, శ్రీను చదువు పూర్తి అయ్యాక చూద్దాం' అని చెప్పారు. చదువు పూర్తయింది. ఆ తర్వాత మద్రాసు చేరుకున్నారు. మాదాల రంగారావు సారథ్యంలో తెరకెక్కిన 'స్వరాజ్యం'లో రెండు పాటలు పాడారు. 'కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగెటోడ' పాట మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఆ తర్వాత ‘నేటి భారతం'లో 'అత్తా పోదాం రాయే.. సర్కారు దవఖానకు' పాటతో పాటు మరో గీతాన్ని ఆలపించారు. ఓ రోజు ఒంగోలులో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్... సి.నారాయణరెడ్డి రాసిన 'వందేమాతరం' పాటను అక్కడ పాడారు. సరిగ్గా అదే సమయంలో టి.కృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తుండటం వల్ల శ్రీనివాస్ పాడిన పాట గురించి తెలిసి మద్రాసు పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సి.నారాయణరెడ్డితో మాట్లాడి తన సినిమాలో శ్రీనివాస్‌తో ఈ పాట పాడించారు. అప్పటివరకూ సినిమాకు టైటిల్ కూడా పెట్టలేదు. శ్రీనివాస్ పాట పాడిన తర్వాత ‘వందేమాతరం’ అని టైటిల్ ఖరారు చేశారు. ఆ పాట తెలుగునాట మార్మోగిపోయింది. అయితే, అప్పటికే చిత్ర పరిశ్రమలో అనేకమంది శ్రీనివాస్‌లు ఉండటంతో ఈయనను కూడా శ్రీనివాస్ అని రాస్తే పాఠకులు తికమకపడతారని ‘వందేమాతరం’ శ్రీనివాస్ అని పత్రికల్లో రాశారు. అప్పటి నుంచి కన్నెబోయిన శ్రీనివాస్ కాస్తా ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గా మారారు.