Valimai heroine Huma Qureshi: 'కాలా', 'వలిమై' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ హ్యూమా ఖురేషీ. థియేటర్ ఆర్టిస్టు, మోడల్‌గా రాణిస్తూ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ విశేషాలను గురించి తెలుసుకుందాం...
పుట్టి పెరిగింది...
Huma Qureshi hometown: మాది దిల్లీ. నాన్నకి అక్కడ సలీమ్ పేరుతో పది రెస్టారెంట్లు ఉన్నాయి. అమ్మ గృహిణి. నాకు ముగ్గురు అన్నయ్యలు. నేను దిల్లీలోని గార్గి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా. నాకు చదువుకునే రోజుల్లోనే సినిమాలపైన ఆసక్తి కలిగింది. థియేటర్ ఆర్టిస్టుగా చేస్తే అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో కాలేజీ రోజుల్లోనే ఆ దిశగా అడుగులేేశా.
తొలి అవకాశం...
Huma Qureshi first movie: థియేటర్ ఆర్టిస్టుగా చేస్తూనే ముంబయికి మకాం మార్చా. తరవాత మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు హిందుస్థాన్ యూనీలివర్ ఉత్పత్తుల వాణిజ్యప్రకటనల్లో నటించే అవకాశం దొరికింది. కొన్నాళ్లకి ఆమిర్‌ఖాన్‌తో కలిసి శాంసంగ్ ప్రకటనలో నటించా. ఆ యాడ్ షూటింగ్‌లోనే దర్శకుడు అనురాగ్ కశ్యప్ నా నటన చూసి 'నీకు తప్పకుండా నా సినిమాలో అవకాశమిస్తా...' అని చెప్పారు. ఇలా ఎంతో మంది చెబుతుంటారులే అని నేను తేలిగ్గా తీసుకున్నా. కానీ ఆయన మాటిచ్చినట్టే 'గ్యాంగ్స్ ఆఫ్ వసీపుర్'లో నటించే అవకాశమిచ్చారు. అందులో నా నటన నచ్చడం వల్ల కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లోనూ ఛాన్స్ ఇచ్చారు. క్రమంగా ఇతర సినిమా అవకాశాలూ వచ్చాయి.
కాలా ఎలా...
Dhanush Huma qureshi: తమిళ హీరో ధనుష్ నాకు మంచి స్నేహితుడు. తరచూ మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు ఫోన్ చేసి "నువ్వు ఉన్నపళంగా చెన్నైకి రావాలి. 'కాలా'లో నటిస్తున్నావ్ అంతే..." అన్నాడు. తనే హీరోనేమో అనుకుని చెన్నై వెళ్లి కలిశా. అప్పుడు తెలిసింది ఆ సినిమాకి ధనుష్ నిర్మాతనీ, రజినీ కాంత్ హీరో అనీ. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషమనిపించింది. సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ చెబుతుండేవారు. షూటింగ్ మధ్యలో డైలాగులు ప్రాక్టీసు చేస్తుంటే 'ఇది సినిమా, పబ్లిక్ పరీక్ష కాదు' అనేవారు రజినీ. ఇక, ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకీ చేరువయ్యాను.