కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా స్తంభించి పోయిన చిత్ర పరిశ్రమలో నెమ్మదిగా సినిమాల సందడి షురూ కాబోతుంది. ఇప్పటికే నిర్మాణాంతర పనులు చేసుకోవడానికి పరిశ్రమకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. జూన్ నుంచి చిత్రీకరణలు కూడా ప్రారంభించుకోవచ్చని ఓ స్పష్టతనిచ్చేసింది.
ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలంతా తమ తమ ప్రాజెక్టులను తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడిలా సెట్స్‌పైకి వెళ్లబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి పవన్ కల్యాణ్ రీఎంట్రీ చిత్రం 'వకీల్‌సాబ్'పైనే ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన తుది దశ చిత్రీకరణ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు.