బాలీవుడ్ నటి వాణీ కపూర్ ఆదివారం (ఆగస్టు 23) 32వ పడిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను తాను చాలా మిస్ అవుతున్నట్లు వెల్లడించింది. ఆమె తల్లిదండ్రులు శివ, డింపీ కపూర్.. సోదరి నుపూర్ చోప్రా లేకుండా పుట్టినరోజు జరుపుకోవడం అసంపూర్తిగా ఉందని తెలిపింది.
"పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు, సోదరి లేకపోతే ఏదో వెలితిగా ఉంది. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులైన వారు ప్రతి విషయంలో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఆ ముగ్గురిని మిస్ అవుతున్నా. ఇంటికే పరిమితమైన నేను ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నా. తర్వాత ఏడాది అయినా బాగుంటుందని ఆశిస్తున్నా."
- వాణీ కపూర్, బాలీవుడ్ నటి
వాణీ కపూర్.. తన పుట్టినరోజు నాడు ఆమె కుటుంబసభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడింది. "ఈ ఏడాది నా పుట్టినరోజున ఇలా చిన్న చిన్న ఆనందాలైనా దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితులు వీడియో కాల్ ద్వారా కేక్ కట్ చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. అలా కొత్త అనుభూతిని పొందుతాం. ఇలాంటివి జరగడం చాలా సరదాగా అనిపిస్తోంది" అని వెల్లడించింది వాణి.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న 'బెల్ బాటమ్'లో హీరోయిన్గా నటిస్తోంది వాణీ కపూర్. దీంతో పాటు అభిషేక్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రాల్లోనూ కథానాయికగా ఎంపికైంది. 'బెల్ బాటమ్' చిత్రీకరణ కోసం ఆమె త్వరలోనే స్కాట్లాండ్కు వెళ్లే అవకాశం ఉంది.